UK Elections: యూకేలో ఎన్నికలు.. కన్జర్వేటివ్స్‌కు ఓటమి తప్పదా ? బ్రిటన్‌లో పార్లమెంటు ఎన్నికలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ, అలాగే లేబర్ పార్టీ మధ్యే గట్టి పోటీ ఉండనుంది. అయితే కన్జర్వేటీవ్ పార్టీకి ఓటమి తప్పదని.. లేబర్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని ఒపినియన్ పోల్స్ చెబుతున్నాయి. By B Aravind 04 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి బ్రిటన్‌లో పార్లమెంటు ఎన్నికలు మొదలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ అలాగే కెయిర్ స్టార్మర్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఇంగ్లాండ్‌తో సహా.. స్కాంట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో మొత్తం 650 నియోజకనర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 326 సీట్ల మెజార్టీ రావాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీలతో పాటు గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, లిబరల్ డెమొక్రాట్స్, డెమొక్రాటిక్ యూనియనిస్ట్, ఎస్‌డీఎల్‌పీ తదితర ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. మొత్తం యూకే వ్యాప్తంగా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. 4.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చాలామంది పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు అక్కడ ఓటింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ కూడా చేపడతారు. యూకే కాలమానం ప్రకారం చూసుకుంటే గురువారం అర్ధరాత్రి కంటే ముందే (ఇండియాలో శుక్రవారం తెల్లవారుజామున ) తొలి ఫలితం రానుంది. Also Read: పనిభారం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న రోబో! కన్జర్వేటివ్‌కు షాక్ తప్పదా ? అయితే ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఉన్న కన్జర్వేటీవ్ పార్టీకి ఓటమి తప్పదని ఒపినియన్ పోల్స్ చెబుతున్నాయి. 1997 లాగే.. లేబర్ పార్టీకి ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత 14 ఏళ్ల నుంచి యూకేలో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. వలసలను కట్టడి చేయడంలో విఫలమవ్వడం, ఇతర అంశాల్లో సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం సంచలనం రేపాయి. ఎన్నికల్లో భారత సంతతి హవా ఈ ఎన్నికల్లో కూడా భారత సంతతి అభ్యర్థుల హవా కనిపిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు పార్లమెంటులో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. ఇప్పుడు కూడా ప్రధాన పార్టీలైన కన్జర్వేటీవ్, లేబర్ పార్టీల తరుఫున పెద్ద ఎత్తున భారతీయ మూలాలున్న ఎంపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. 2019లో 15 మంది భారత సంతతికి చెందినవారు పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీలో ప్రధాని రిషి సునాక్‌తో పాటు.. ప్రీతి పటేల్, గగన్ మొహీంద్ర, శైలేష్ వారా, క్లెయిర్ కౌటిన్హో అభ్యర్థులు మళ్లీ బరిలోకి దిగారు. వీళ్లతో పాటు కొత్తగా అమీత్ జోగియా, శివానీ రాజా తదితరులకు కన్జర్వేటీవ్ పార్టీ టికెట్లు ఇచ్చింది. పోటీలో తెలంగాణ వాసి మరోవిషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లా తెలంగాణ సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి కూడా కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక లేబర్ పార్టీ తరఫున ప్రీత్ కౌర్ గిల్, తన్మన్‌జీత్ సింగ్ దేశి, లీసా నంది, నవేందు మిశ్రా, సీమా మల్హోత్రా తదితరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా భారత సంతతి వ్యక్తులకు టికెట్లు ఇచ్చాయి. లేబర్ పార్టీకి దాదాపు 41 శాతం ఓట్లు రావొచ్చని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కన్జర్వేటీవ్ పార్టీకి 21 శాతానికి పెరిగె అవకాశం లేదని చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానిపై యూకేతో సహా పలు దేశాల్లో ఆసక్తి నెలకొంది. Also Read: గందరగోళంగా మారిన నేపాల్ ప్రధాని పదవి! సేమ్ టు సేమ్.. కాకపోతే యూకే ఎన్నికలు కూడా భారత్‌లో జరిగే ఎన్నికల్లాగే ఉంటాయి. ఓటర్లు ఎంపీలను ఎన్నుకుంటారు. ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే.. ఆ పార్టీ నుంచే ఎంపీలు ప్రధానిని ఎన్నుకుంటారు. కాకపోతే భారత్‌లో పార్లమెంటు ఎన్నికలు ఈవీఎం పద్ధతిలో జరుగుతాయి. కానీ యూకేలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. ఏ పార్టీ అయితే గెలుస్తుందో.. ఆ పార్టీ ప్రధాని.. యూకే రాజు వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కొరుతారు. యూకే కింగ్ లేదా క్వీన్ నుంచి పర్మిషన్ వచ్చాక ప్రభుత్వం ఏర్పాటవుతుంది. #telugu-news #rishi-sunak #uk-elections #uk-parliament మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి