ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీన్ ఉగ్రసంస్థ హమాస్ దాదాపు 5వేల రాకెట్లతో బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అనంతరం రంగంలోకి దిగిన ఇజ్రాయెల్.. హమాస్ నియంత్రణలో ఉన్న గాజా ప్రాంతంపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ విషయంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతు ప్రకటిస్తే.. మరికొన్ని పాలస్తీనాకు తమ మద్దతిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఇరుదేశాల మధ్య నెలకొన్న సంక్షోభానికి తెరపడలేదు. ఇప్పటికే ఈ భీకర యుద్ధ వాతావరణంలో వేలాది మంది పౌరులు మృతి చెందడం కలకలం రేపుతోంది. అలాగే తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిపై వైమానిక దాడి జరగడం.. అందులో దాదాపు 500 మంది మృతి చెందడం ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసింది. ఇదిలా ఉండగా.. శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భారతీయ జనతా పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీని ఆయన ఉగ్రసంస్థ అయిన హమాస్‌తో పోల్చాడు.
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇజ్రాయెల్-హమాస్ వివాదం గురించి చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందనకు కౌంటర్ ఇస్తూ సంజయ్ రౌత్ చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ కూడా హమాస్ కంటే తక్కవేమి కాదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి.. విపక్షాలను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత బిశ్వ శర్మ ముందుగా చరిత్రను చదివి అర్థం చేసుకోవాలంటూ హితువు పలికారు. ఇజ్రాయెల్-పాలస్తీన్‌పై గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ ఏమన్నారో తెలుసుకోవాలని పేర్కొన్నారు.
Also Read: 30 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న తండ్రి.. కొడుకులు ఏం చేశారో తెలిస్తే షాక్
అయితే అంతకుముందు.. శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలేపై హిమంత శర్మ తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను హమాస్ తరపున పోరాడేందుకు గాజా పంపుతారని తాను అనుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు.. శరద్ పవార్ ప్రసంగాన్ని బీజేపీ శ్రద్ధగా వినాలని శర్మ చేసినటువంటి వ్యాఖ్యలపై సుప్రియా సూలే స్పందించారు. హిమంత బిశ్వ శర్మ, తాను ఒకే డీఎన్ఏను కలిగి ఉన్నామని, ఇద్దరం కూడా కాంగ్రెస్‌లో పనిచేసినట్లు ఆమె గుర్తుచేశారు. బీజేపీ మహిళలను ఎలా అవమానిస్తుందో తెలిసినప్పటికీ కూడా.. హిమంత శర్మపై తనకు ఆశలుండేవని, కానీ కాషాయ పార్టీలో చేరగానే ఆయన పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యం కలిగించిందంటూ ఆమె వ్యాఖ్యానించారు.