గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి దాటిన తరువాత ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్ (28), త్రిశూర్ కు చెందిన డాక్టర్ అజ్మల్ (28) ఇద్దరు కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. శనివారం రాత్రి ఆస్పత్రిలో డ్యూడీ ముగిసిన తరువాత కారులో ఇద్దరు బయల్దేరారు. వారు బయల్దేరే సమయంలో వారి కారులో మరో డాక్టర్ తబ్సిర్, ఓ ఎంబీబీఎస్ స్టూడెంట్ తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా కారులో ఎక్కారు.
కారును అద్వైత్ నడుపుతున్నారు. ఆదివారం అద్వైత్ పుట్టిన రోజు కావడంతో షాపింగ్ కూడా చేసి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో అద్వైత్ గూగుల్ మ్యాప్స్ లో జీపీఎస్ ను చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు.
మధ్యలో ఓసారి జీపీఎస్ రీ రూట్ అయ్యింది. పెరియార్ నదిలోకి దారి చూపించింది. దానిని అనుసరించిన అద్వైత్ నీరు ఉన్న ప్రాంతాన్ని రోడ్డు అనుకోని కారును పోనిచ్చాడు. కానీ అక్కడ రోడ్డు లేకపోగా..కారు నేరుగా నీటిలోకి తీసుకెళ్లాడు. అది రోడ్డు కాదు నది అని గుర్తించేలోపు కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
ఈ ఘటనలో అద్వైత్, అజ్మల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తబ్సిర్, తమన్నా, జిస్మాన్ ను స్థానికులు రక్షించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
జీపీఎస్ తప్పుగా సూచించడం వల్లే కారు నది వైపునకు వెళ్లింది. కొన్ని సందర్భాల్లో జీపీఎస్ ట్రాఫిక్ తక్కువ ఉన్న వైపు సూచిస్తుంది . అటువంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.. ఆ మార్గాలు అంత సరక్షితమైనవి కాదని నిపుణులు చెబుతున్నారు.