TS Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై సంచలన స్టడీ.. ఏ సీటులో ఎవరు గెలుస్తారంటే?

ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో పై చేయి ఏ పార్టీది? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హస్తం పార్టీ మళ్లీ రిపీట్ చేస్తుందా? బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? బీజేపీ దూసుకొస్తుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Telangana Game Changer: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు ఇలా.. రవిప్రకాశ్ చెప్పిన సంచలన లెక్కలివే!

Telangana : తెలంగాణలో లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) లకు మించి ఫలితాలను సాధించి తెలంగాణలో తమకు తిరుగులేదని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ(Congress Party) విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించి తెలంగాణ గడ్డపై తమ ప్రభావం తగ్గలేదని చాటేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కుదిరితే ఒకటి లేదంటే రెండో స్థానంలో నిలిచి రానున్న రోజుల్లో రాష్ట్రంలో తమదే అధికారం అనే వాతావరణం తీసుకురావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు(Telangana Election Results) ఎలా ఉండబోతున్నాయి అన్న అంశంపై ఆర్టీవీ అంచనాలను వెల్లడించారు రవిప్రకాష్.

ఆర్టీవీ స్టడీ ప్రకారం జిల్లాల వారీగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండే అవకాశం ఉంది..

1. ఆదిలాబాద్:
తెలంగాణకు ఎంట్రీ పాయింట్‌ ఆదిలాబాద్‌. గత ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించిన ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఇపుడు ఆదివాసీ, గిరిజన, గోండులు ఎటువైపు మొగ్గితే వారిదే విజయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: ఆత్రం సుగుణ - వృత్తిరీత్యా టీచర్. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న యాక్టివిస్టుగా పేరుంది.

బీజేపీ: గోడం నగేష్ - చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, రాష్ట్రమంత్రిగా చేశారు. ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్: ఆత్రం సక్కు - బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా చేశారు.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

2. పెద్దపల్లి:
ఆదిలాబాద్‌ తర్వాత తెలంగాణ తలాపున వుండే పెద్దపల్లి లోక్‌సభ సీటు కాకా వెంకట స్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. 2024లో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్: గడ్డం వంశీకృష్ణ - కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు.

బీజేపీ: గోమాస శ్రీనివాస్ - ఏబీవీపీ నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో కొనసాగి, ఇటీవల బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్: కొప్పుల ఈశ్వర్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్ర మంత్రిగా, చీఫ్ విప్‌గా పనిచేశారు.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

3. కరీంనగర్‌: 
కరీంనగర్‌.. దేశానికి ప్రధానితోపాటు ఎందరో రాజకీయ దురంధరులను అందించిన లోక్‌సభ నియోజకవర్గం. పీవీ నరసింహారావు వంటి రాజకీయ చాణక్యులతో పాటు శ్రీపాద రావు, చొక్కారావు వంటి బడా రాజకీయవేత్తలను అందించిన ప్రాంతమిది. తెలంగాణ ఉద్యమానికి మొదట్నించి ఊపిరినిచ్చిన ప్రాంతం. కేసీఆర్‌కు అండగా నిలబడి.. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ సీటిది. 2024లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, టీఆర్ఎస్ నుంచి బి.వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు.

బీజేపీ: బండి సంజయ్ - ఆర్‌ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న నేత. సిట్టింగ్ ఎంపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

కాంగ్రెస్: వెలిచాల రాజేందర్‌రావు - గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. చాన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.

బీఆర్ఎస్: బి.వినోద్‌కుమార్ - తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితుడు, రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

గెలిచే ఛాన్స్: బీజేపీ

4. నిజామాబాద్‌:
నిజామాబాద్‌. మహారాష్ట్ర కల్చర్‌తోపాటు తెలంగాణ, ఆంధ్ర సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో విశేషాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్: టి.జీవన్ రెడ్డి - టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చి, చాలా కాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేత. మంత్రిగా చేశారు.

బీజేపీ: ధర్మపురి అరవింద్ - సిట్టింగ్ ఎంపీ. మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ రాజకీయ వారసుడు.

బీఆర్ఎస్: బాజిరెడ్డి గోవర్ధన్ - మాజీ ఎమ్మెల్యే. మాజీ ఆర్టీసీ చైర్మన్. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు.

గెలిచే ఛాన్స్: బీజేపీ

5. జహీరాబాద్‌:
జహీరాబాద్‌.. 2009లో ఏర్పాటైన జహీరాబాద్‌ లోక్‌సభ సీటు భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం కలిగిన జిల్లా. వెనుకబడిన ప్రాంతాలుగా పేరున్న నారాయణ్‌ఖేడ్‌, ఆందోల్‌, జుక్కల్‌ వంటి ప్రాంతాలున్న నియోజకవర్గం. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బి.బి.పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్: సురేష్ షెట్కార్ - కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ఎంపీ.

బీజేపీ: బి.బి.పాటిల్ - పదేళ్లుగా బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ. ఆఖరు నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.

బీఆర్ఎస్: గాలి అనిల్ కుమార్ - బలమైన బీసీ నేత. చాలా కాలం కాంగ్రెస్‌లో కొనసాగి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరారు.

గెలిచే ఛాన్స్: బీజేపీ

6. మెదక్‌:
మెదక్.. 1980లో ఇందిరాగాంధీకి అండగా నిలబడిన నియోజకవర్గం. మెదక్‌ నియోజవర్గంలో పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: నీలం మధు - పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీ మారి మళ్లీ తిరిగొచ్చి ఎంపీ టికెట్ పొందారు.

బీజేపీ: రఘునందన్‌రావు - తెలంగాణ ఉద్యమకారుడు. ఒకసారి ఎమ్మెల్యే. దుబ్బాక ఉపఎన్నికతో రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.

బీఆర్ఎస్: వెంకట్రామిరెడ్డి - కలెక్టర్‌గా పనిచేశారు. మల్లన్నసాగర్ భూసేకరణ సమయంలో చురుగ్గా పనిచేశారు. బీఆర్ఎస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు.

గెలిచే ఛాన్స్: బీజేపీ

7. వరంగల్‌:
పోరుగల్లు.. ఓరుగల్లు నుంచి వరంగల్‌గా మారిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎమ్.సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్: కడియం కావ్య - సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కుమార్తె. వృత్తిరీత్యా డాక్టర్. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

బీజేపీ: ఆరూరి రమేష్ - మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్: ఎమ్.సుధీర్ కుమార్ - హన్మకొండ జడ్‌పీ చైర్మన్‌గా ఉన్నారు.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

8. మహబూబాబాద్‌:
మహబూబాబాద్‌.. 2009లో ఏర్పాటైంది ఈ లోక్‌సభ సీటు. గిరిజనులు, ఆదివాసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం వరంగల్‌కు పొరుగునే ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: బలరాం నాయక్ - మాజీ ఎంపీ, కేంద్రమంత్రిగా చేశారు.

బీఆర్ఎస్: మాలోత్ కవిత - సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే.

బీజేపీ: అజ్మీరా సీతారాం నాయక్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. 2014 నుంచి 2019 వరకూ మహబూబాబాద్ ఎంపీగా చేశారు.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

9. మహబూబ్‌నగర్‌:
పాలమూరుగా చారిత్రక నేపథ్యం వున్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సీటు తెలంగాణలోపాటు కర్నాటక కల్చర్‌ని ఒంటబట్టించుకున్న ప్రాంతం ఇది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీ.కే.ఆరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: చల్లా వంశీచంద్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడిరాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు.

బీజేపీ: డీ.కే.అరుణ - బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మాజీ మంత్రి.

బీఆర్ఎస్: మన్నె శ్రీనివాస్ రెడ్డి - సిట్టింగ్ ఎంపీ.

గెలిచే ఛాన్స్: బీజేపీ

10. నాగర్‌ కర్నూలు:
నాగర్ కర్నూల్‌.. కృష్ణా నదికి తలాపున వున్న నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వుడు సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్‌.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. వీరిలో మల్లు రవి మాల సామాజికవర్గం, మిగిలిన అభ్యర్ధులు పోతుగంటి భరత్, ఆర్‌.ఎస్.ప్రవీణ్‌ కుమార్ మాదిగ సామాజికవర్గం నేతలు.

కాంగ్రెస్: మల్లు రవి - రాజకీయ కుటుంబ వారసత్వం ఉంది. రెండు సార్లు ఎంపీగా చేశారు.

బీజేపీ: పోతుగంటి భరత్ - తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి రాములు 3 సార్లు ఎంపీ.

బీఆర్ఎస్: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ - రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

11.నల్గొండ
వామపక్ష ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తెగువ చూపిన ప్రాంతం. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: కుందూరు రఘువీర్ రెడ్డి - జానారెడ్డి రాజకీయ వారసుడు. తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

బీజేపీ: శానంపూడి సైదిరెడ్డి - మాజీ ఎమ్మెల్యే. చాలా కాలం బీఆర్‌ఎస్‌లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్: కంచర్ల కృష్ణారెడ్డి - బీఆర్‌ఎస్‌లో చాలాకాలంగా ఉన్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

12.ఖమ్మం:
ఖమ్మం.. తెలంగాణకు, ఆంధ్రా ప్రాంతానికి గుమ్మంలా వున్న ఖమ్మం భిన్న సంస్కృతులున్న లోక్‌సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, బీజేపీ నుంచి వినోద్‌రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్: రామసహాయం రఘురాంరెడ్డి - మాజీ మంత్రి సురేందర్‌రెడ్డి కుమారుడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువు. విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు.

బీజేపీ: వినోద్ రావు - తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న నేత.

బీఆర్ఎస్: నామా నాగేశ్వరరావు - సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభలో బీఆర్‌ఎస్ పక్ష నేత.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

13.భువనగిరి:
రాష్ట్ర రాజధాని నుంచి పాత నల్గొండ ప్రాంతం దాకా విస్తరించిన ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే తెలంగాణ తిరుమలగా భావించే.. లక్ష్మీ నరసింహస్వామి వెలసిన యాదగిరిగుట్ట ఆలయం ఉంది. ప్రస్తుతం బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశం బరిలో ఉన్నారు.

బీజేపీ: బూర నరసయ్యగౌడ్ - మాజీ ఎంపీ. వృత్తిరీత్యా డాక్టర్.

కాంగ్రెస్: చామల కిరణ్ కుమార్ రెడ్డి - రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు.

బీఆర్ఎస్: క్యామ మల్లేశం - మాజీ ఎమ్మెల్యే. తొలిసారి ఎంపీగా పోటీ.

గెలిచే ఛాన్స్: కాంగ్రెస్

14.మల్కాజ్‌గిరి:
మల్కాజ్‌గిరి.. 2009లో ఏర్పాటైన మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గం. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పట్నం సునీత, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్: పట్నం సునీత - రెండు సార్లు జడ్‌పీ చైర్మన్‌గా చేశారు. తొలిసారి ఎంపీగా బరిలో ఉన్నారు.

బీజేపీ: ఈటల రాజేందర్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.

బీఆర్ఎస్: రాగిడి లక్ష్మారెడ్డి - తొలిసారి ఎంపీ ఎన్నికల బరిలో ఉన్నారు.

గెలిచే ఛాన్స్: బీజేపీ

15. సికింద్రాబాద్‌:
సికింద్రాబాద్‌.. జంటనగరాలలో విస్తరించి వున్న సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మూడు మతాల వారితోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల సెటిలర్లు ఓటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్: దానం నాగేందర్ - ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి. ఇటీవల తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.

బీజేపీ: కిషన్ రెడ్డి - సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

బీఆర్ఎస్: పద్మారావు గౌడ్ - డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నారు.

గెలిచే ఛాన్స్: బీజేపీ

16. చేవెళ్ళ:
చేవెళ్ళ.. హైదరాబాద్‌ శివార్లలోని మూడు అర్బన్‌ సెగ్మెంట్లు.. వికారాబాద్‌ జిల్లాలోని మూడు రూరల్‌ సెగ్మెంట్లలో విస్తరించి వుంది ఈ లోక్‌ సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: జి. రంజిత్ రెడ్డి - సిట్టింగ్ ఎంపీ, పారిశ్రామికవేత్త.

బీజేపీ: కొండా విశ్వేశ్వర్ రెడ్డి - మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త.

బీఆర్ఎస్: కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ - ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు. బలమైన బీసీ నేత. మాజీ ఎమ్మెల్సీ.

గెలిచే ఛాన్స్: బీజేపీ

17.హైదరాబాద్:
ప్రస్తుతం ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ మరోసారి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు.

ఎంఐఎం: అసదుద్దీన్ ఒవైసీ - నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. ఎంఐఎం అధినేత.

బీజేపీ: కొంపెల్ల మాధవీలత - తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సామాజిక సేవాకార్యక్రమాలతో గుర్తింపు పొందారు.

బీఆర్ఎస్: గడ్డం శ్రీనివాస్ యాదవ్ - బీసీ, యాదవ సామాజికవర్గం నేత.

కాంగ్రెస్: మహ్మద్ వలీవుల్లా సమీర్ - ముస్లిం మైనారిటీ నేత.

గెలిచే ఛాన్స్: ఎంఐఎం
publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు