TS Elections 2023 - Congress Manifesto: ఎన్నికల సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ సంచలన హామీలు ఇస్తోంది. కర్ణాటకలో ఎలా అయితే ఇచ్చిందో తెలంగాణలో కూడా అదే స్ట్రాటజీని అమలు చేస్తోంది. టీపీసీసీ (TPCC) మ్యానిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది.మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..మరో అద్భుత హామీపై చర్చించారు. ఆడపిల్లల పెళ్లికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చేలా ఓ సంచలన హామీని ప్రతిపాదించారు. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల ప్రభుత్వ సహాయంతోపాటు పసుపు కుంకుమల కింద తులం బంగారం (Gold) ఇస్తామని కాంగ్రెస్ (Congress) ప్రతిపాదించింది.
బీఆర్‌ఎస్ కంటే తులం ఎక్కువే:
నిజానికి ఈ తరహా స్కీమ్ బీఆర్‌ఎస్ (BRS) ఇప్పటికీ అమలు చేస్తోంది. కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం ఇది. మార్చి 13 2017లో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుంచి రూ.75,116 వరకు పెంచారు. మార్చి 19 2018లో రూ.1,00,116కు పెంచారు.దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందిస్తున్నారు. ఇప్పటివరకు ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి స్కీం కింద ఈ సాయం అందిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే దీనితో పాటు బంగారం కూడా ఇస్తాం అని చెబుతోంది.
అదే ఫార్ములా?
కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ గెలుపునకు మ్యానిఫెస్టోనే కారణం అనే ప్రచారం ఉంది. ఈ అస్త్రంతోనే కర్ణాటకలో దూసుకుపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల ఓట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఉచిత బస్సు ప్రయాణం హామీ కర్ణాటకలో వర్క్ అవుట్ అయ్యింది.. ఇక్కడ కూడా అదే హామీని అమలు చేస్తామని చెబుతోంది. రాష్ట్రంలోని మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను కాంగ్రెస్ గత నెలలో ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన విద్యాభరోసా కార్డులు మంజూరు చేస్తామని.. ప్రతి మండలానికి ఒక తెలంగాణ అంతర్జాతీయ పాఠశాల ఉంటుందని చెప్పింది.
ALSO READ: భవ్యశ్రీ హత్య కేసు ఏమైంది..20 రోజులైన రాని క్లారిటీ..!