Telangana Congress : తెలంగాణ(Telangana) లో అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్(Congress) పార్టీ కొత్త ఉత్సాహంతో దూసుకెళుతోంది. ఇటీవల పలు రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను మార్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే(Manikrao Thakare) స్థానంలో దీపా దాస్ మున్షీ(Deepa Das Munshi) ని అధిష్టానం నియమించింది. సోమవారం నాడు ఆమె ఢిల్లీలో ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్(BRS), బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించిందని.. తెలంగాణలో 6 గ్యారెంటీలకు మించిన అద్భుతమైన హామీలు ప్రకటిస్తామని వివరించారు. ఈసారి తెలంగాణలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని.. ఆ దిశగా పార్టీ నేతలందరినీ కలుపుకుని టీమ్‌వర్క్‌తో పనిచేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో పొత్తు ఉంటుందని తేల్చేశారు.
షర్మిల పార్టీకి అవసరమే..
వైటీపీ అధినేత వైఎస్ షర్మిల(YS Sharmila) పై దీపా దాస్ మున్షీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని తెలిపారు. మున్ముందు షర్మిల ఎలా పనిచేయాలి.. ఆమెను ఎలాంటి స్థానం కల్పించాలనేది అధిష్టానం త్వరలో డిసైడ్ చేస్తుందని తెలిపారు. గతంలో షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తుందని.. ఏపీలో కీలక బాధ్యతలు అప్పజెబుతారని ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో షర్మిలకు ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పజెబుతారా..? లేదంటే తెలంగాణలోనే పార్టీలో స్థానం కల్పిస్తారని అనేది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: సింగరేణి ఎన్నికలకు రంగం సిద్ధం.. హోరాహోరీ తలపడనున్న ప్రధాన సంఘాలు
ఆరు గ్యారెంటీలపై సమీక్ష
జనవరి 2వ తేదీన తాను తెలంగాణలో పర్యటిస్తానని దీపా దాస్ మున్షీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరితో సమావేశం నిర్వహిస్తానని.. అందరినీ కలుపుకుని ముందుకు వెళతామన్నారు. ఒక టీమ్ వర్క్‌తో పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రివర్గం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో దీపా దాస్ మున్షీ రాకతో హామీల అమలు మరింత వేగవంతం కానుంది.