ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన జరిగి దాదాపు 15 రోజులు గడిచిన కార్మికులు బయటకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా డ్రిల్లింగ్ మిషన్లు మోరాయించడం వల్లే వారిని బయటకి తీసుకురావడం ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం కొండపై నుంచి నిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. అధికారులు ఆ కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్, పైపుల ద్వారా అందజేస్తున్నారు. అయితే అధికారులు అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానసిక భయాందోళనకు మించిన భయంకర వ్యాధి మరొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి వేయడం వల్ల ఆహారం తింటారు. కానీ ఎప్పుడు బయటపడుతామో అనే ఆలోచన ఉండటంతో.. ఆందోళన వల్ల పోషక విలువలు ఉన్న ఆహారం తిన్నా కూడా అది సహించదని అంటున్నారు.
కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోవడానికి చోటు లేని ఆ ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదని.. ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితి సంఘర్షణలో ఉంటే.. మిగతా ఆరోగ్య వ్యవస్థలు సరిగా ఉండవని నిపుణులు తెలిపారు. సొరంగంలో సిలికా ఉండటం వల్ల ఆ కార్మికులకు తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులందించే కృత్రిమ ఆక్సిజన్ వారిని కాపాడుతుందని కూడా చెప్పలేమని.. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస తీసుకొవడం ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. అయితే కార్మికులకు ఇప్పటికే విటమిన్ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించి మందులు పంపిచారమని అధికారులు తెలిపారు.
మరోవైపు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ.. ఒకే పరిస్థితి అనుభవించాల్సి వచ్చినప్పుడు వివిధ వ్యక్తులకు భిన్నమైన మానసిక ప్రతిస్పందన ఉంటుందని.. అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని తెలిపారు. కార్మికులు సొరంగం నుంచి బయటపడిన వెంటనే వారు కొన్ని రోజుల వరకు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కొందరూ డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుంటాయని అందుకే వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి వస్తుందని వెల్లడించారు.