తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతీ నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టిందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రేవంత్.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు వాయిదా?
బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీనని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడం లేదన్నారు.
మీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిందంటూ లేఖలో విమర్శించారు రేవంత్ రెడ్డి. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యం అని అన్నారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయిందని ధ్వజమెత్తారు. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేవారు. అప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందన్నారు.