మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపు, ఓటమిలు నిర్ణయించడంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరింది. వీళ్లలో పురుషులు 1,62,98,418 మంది ఉండగా.. మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్‌జెండర్లు 2,676 మంది ఉండగా.. సర్వీసు ఓటర్లు 15,406 ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సెప్టెంబర్ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టింది. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 3,17,32,727 మంది ఓటర్లు ఉన్నారు. నవంబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. అక్టోబర్ 31 వరకు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు వేసులుబాటు కల్పించింది.
వచ్చిన దరఖాస్తులను అధికారులు నవంబరు 10 వరకు పరిశీలించారు. అనంతరం దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు జాబితాలను విడుదల చేశారు. వీటి ప్రకారం.. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాతో పోలిస్తే 8,85,478 మంది ఓటర్లు పెరిగారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో మహిళల కన్నా పురుషులు 28,154 మంది ఎక్కువగా ఉన్నారు. కానీ తాజాగా ప్రకటించిన జాబితాలో పురుషుల కన్నా 3,287 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు.
Also Read: రూ.20 వేల కోట్లతో వరద సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి కేటీఆర్ హామీ..
రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు 75 స్థానాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరో 44 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 26 జిల్లాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం మరో విశేషం. కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తిలలో మాత్రం ఎక్కువగా పురుష ఓటర్లు ఉండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్లు రికార్డుస్థాయిలో 9,99,667 మంది నమోదయ్యారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో 18-19 ఏళ్ల ఓటర్లు 8,11,648 మంది ఉన్నారు. అక్టోబరు 31 తర్వాత మరో 1,88,019 మంది అదనంగా నమోదయ్యారు.