WI vs ENG : ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు కైవసం చేసుకుంది. సొంతగడ్డపై బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్ మైదానంలో శనివారం జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించి 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్ 25 ఏండ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్ మీద వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో వచ్చిన బెన్ డకెట్(71), లివింగ్‌స్టోన్(45) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. ఆ తర్వాత విండీస్ బ్యాటింగ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో, రిఫరీలు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విండీస్‌కు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేను వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఛేదనలో 2 పరుగులకే ఓపెనర్ బ్రాండన్ కింగ్ ఔటైనా మరో ఓపెనర్ అలిక్ అథనజె(45) పట్టుదలగా ఆడాడు. కేసీ కార్టీ(50) హాఫ్ సెంచరీతో చెలరేగగా చివరల్లో రొమారియో షెఫర్డ్ (43) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Also read : ఆ ఒక్క బోల్డ్ సీన్ నన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.. ‘యానిమల్’పై తృప్తి
ఇక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న వెస్టిండీస్.. ఇంగ్లిష్ జట్టుతో టీ20 సిరీస్‌ను ఆడనుంది. డిసెంబర్ 12 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా 5 మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌కు వెస్టిండీస్ సెలెక్టర్లు 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. యువ ఆల్‌రౌండర్ మాథ్యూ ఫొర్డే, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్, కైలి మేయర్స్‌లతోపాటు రెండేండ్ల తర్వాత ఆండ్రూ రస్సెల్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నారు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే పొట్టి ప్రపంచకప్ పోటీలకు సన్నాహాల్లో భాగంగానే సెలెక్టర్లు రస్సెల్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది.