తెలంగాణలో స్టాఫ్‌నర్సు పోస్టుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది. చివరి మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 2022 డిసెంబర్ 30న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇందులో ఎంపికైన వారిలో పదిరోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రెడీ అయిపోయింది.
మొత్తం 7,031 పోస్టులు
దీనివల్ల రాష్ట్రంలోని బోధనాసుపత్రులతో సహా.. వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో కూడా 7,031 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు. ఇలాగే బీసీ, ఎస్టీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కూడా సమారు 500 మంది రెగ్యులర్ స్టాఫ్‌నర్సుల నియామకం కావడం వల్ల అటు విద్యార్థులకు కూడా మేలు జరగనుంది. వాస్తవానికి మొదట కేవలం 5,204 పోస్టుల భర్తీకే ప్రకటన ఇచ్చి పరీక్ష నిర్వహించారు. కానీ ఆ తర్వాత కొత్తగా 1827 పోస్టులను కూడా ఇందులో చేర్చడంతో.. మొత్తం 7,031 పోస్టులకు పెరిగాయి.
అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
ఇక రాష్ట్రంలో ఈ పోస్టుల కోసం 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసున్నారు. గత ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించగా.. ప్రభుత్వ వైద్య సేవలో ఇంతకు ముందు పనిచేసినవారికి ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయించారు. వీటి ఆధారంగానే ప్రాథమిక మెరిట్ జాబితాను రూపొందించి 2022 డిసెంబర్ 30 నుంచి ధ్రువపత్రాల పరిశీలన మొదలుపెట్టారు. అయితే తుది మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఇందుకు ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలతో ఈ గడువు ముగియనుంది.
10 రోజుల్లో నియామక ఉత్తర్వులు
ఆ తర్వాత వీటిని పరిష్కరించిన తర్వాత ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను వైద్యారోగ్యశాఖకు అందజేయనున్నారు. దీంతో ఇందుకు సంబంధించి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల జరిగిన వేళ.. ఈ స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియకు 3 నెలల పాటు అంతరాయం ఏర్పడింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియను మొదలుపెట్టడంతో ఇప్పుడు ఇది తుది దశకు చేరుకుంది.