Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి
.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!