లతీఫ్ భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. పఠాన్ కోట్ లో జరిగిన దాడికి లతీఫే కారణం. ఇతన్ని పట్టుకోవడానికి మన ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. పంజాబ్లోని సియాల్ కోట్ లో నూర్ మదీనా మసీద్ లోని ప్రార్ధన చేసి బయటకొస్తుండగా బైక్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లతీఫ్ తో పాటూ మరో ఉగ్రవాది కూడా అక్కడిక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లతీఫ్ ను చంపిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీని మీద పాక్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.
లతీఫ్ కు 41 ఏళ్ళు. జైషే మహ్మద్ కు లాంచింగ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2 న జరిగిన పఠాన్ కోట్ లోని వైమానికి స్థావరం మీద జరిగిన ఉగ్రదాడి మొత్తం రచన చేసినది లతీఫే. ఇందులో 9మంది భారత జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత జరిగిన బాంబు పేలుడులో మరో అధికారి కూడా మరణించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌ఎస్‌జీ, స్వాట్ బృందాలు సమన్వయంతో వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. ముష్కరులను మట్టుబెట్టేందుకు భారత ఆర్మీ ఐదు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల వద్ద పెద్దఎత్తున ఆర్‌డీఎక్స్, గ్రెనేడ్ లాంచర్ మిషన్, 52 ఎంఎం మోర్టార్లు, ఏకే 47 తుపాకులు, జీపీఎస్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు దేశంలోని వైమానిక స్థావరంపై దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో షాహిద్ లతీఫ్ ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో లతీఫ్ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు.
ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ లో ఇలానే ఉగ్రవాదులు హతం అయ్యారు. భారత్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేరిన సయ్యద్ నూర్ షాలోబర్ పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రాంతంలో ఈ ఏడాది మార్చి నెల 4వ తేదీ గుర్తుతెలియని ముష్కరుల చేతిలో హతమయ్యాడు. షాలోబర్ కాశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI సహకారంతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవాడు. అలాగే ఇదే ఏడాది ఫిబ్రవరి 26న అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజా పాకిస్థాన్‌లో కాల్చి చంపబడ్డాడు.సయ్యద్ ఖలీద్ రజాను కరాచీలోని తన ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 2023 ఫిబ్రవరి 22న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో టెర్రర్ బుక్‌గా పేరొందిన ఇజాజ్ అహ్మద్ అహంగర్ హత్యకు గురయ్యాడు. 1996లో కాశ్మీర్ జైలు నుంచి విడుదలైన తర్వాత పాకిస్థాన్‌కు పారిపోయి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లాడు. భారత ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో చేర్చింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలమ్‌ను 20 ఫిబ్రవరి 2023న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. హిజ్బుల్ ముజాహిదీన్ లాంచింగ్ కమాండర్‌గా పని చేసే వాడు. రావల్పిండిలో కూర్చొని జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులకు లాజిస్టిక్స్, ఇతర వనరులను అందించేవాడు.