ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ-టీడీపీ పార్టీ నేతల మధ్య తరుచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని వినుకొండలో వైసీపీ-టీడీపీ (ycp-tdp) నేతల మధ్య చిన్నగొడవ జరిగింది. ఇది కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. దీంతో భారీ సంఖ్యలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారికి సర్ది చెప్పి వివాదానికి తెర దింపాల్సింది పోయి.. వారే అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఐ గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వినుకొండ నియోజకవర్గంలో (Vinukonda) వైసీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ (tdp) శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించగా.. ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ సైతం పోటీగా ర్యాలీ నిర్వహించింది. ఇరు వర్గాలు ఎదురుపడటంతో ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ దాడిలో వైసీపీ-టీడీపీ నేతలు ఒకరిపై పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితులను అదుపు చేయటానికి పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. సీఐ వ్యవహరించిన తీరుపై రెండు వర్గాల నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ర్యాలీకి అనుమతి లేకున్నా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని పోలీసులు ప్రశ్నించారు. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నిస్తే వైసీపీ నేతలు కావాలనే తమను రెచ్చగొట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. తమపైన కేసులు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేతలను విస్మరించటాన్ని తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (MLA Bolla Brahmanaidu) తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మించుకుంటున్న కట్టడానికి మట్టిని (soil) అక్రమంగా తరలిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా గత రెండు రోజుల నుంచి తాము ఆందోళన చేస్తున్నామని టీడీపీ నేతలు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గంలో ఉన్న వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ అంటేనే అవినీతి అని, అవినీతి అంటేనే వైసీపీ అని టీడీపీ శ్రేణులు ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపై ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు.