Electric Bus: దేశంలో 10 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. వచ్చేవారమే టెండర్లు

దేశంలో 169 నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం వచ్చేవారమే టెండర్లు ఆహ్వానించే ఛాన్స్ ఉంది. ముందుగా 3వేల ఈ-బస్‌లు అందుబాటులోకి తీసుకురానున్నారు. 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలకే ఈ సేవలు వర్తించనున్నాయి.

New Update
Electric Bus: దేశంలో 10 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. వచ్చేవారమే టెండర్లు

కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పీఎం ఈ-బస్ సేవ పథకంలో భాగంగా ముందుగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని సేకరించేందుకు చర్యలు చేపడుతోంది. అయితే దీనికోసం వచ్చే వారంలోనే టెండర్లకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్‌ జోషీ తెలిపారు. ఇక పీఎం ఈ-బస్ సేవా పథకం కింద.. పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో 169 నగరాలకు 10 వేల బస్సులు తీసుకురావాలని కేంద్ర కేబినెట్ ఆగస్టులో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దీని గురించి ప్రస్తావించిన మనోజ్ జోషీ.. ఇందులో రాష్ట్రాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని పేర్కొన్నారు.

ఇక ఆగస్టులో కేంద్ర కేబినెట్‌ ఆమోదం ఇచ్చిన అనంతరం రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపేందుకు నెల సమయం ఇచ్చామని.. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2వేల వరకు ఎలక్ట్రిక్ బస్సులకు ప్రతిపాదన వచ్చినట్లు మనోజ్‌ జోషీ తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు కూడా తమ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నాయన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేస్తున్నందున ఖర్చు కూడా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ బస్సుల్లో జీపీఎస్‌తో సహా.. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానమై కదలికలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మరో విషయం ఏంటంటే.. 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు మాత్రమే ఈ పథకం పరిధిలోకి రానున్నాయి. ఆయా చోట్ల అందుబాటులోకి వచ్చే ఈ ఎలక్ట్రిక్ బస్సు సేవలు పదేళ్లపాటు అందుబాటులో ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు