/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/parliment-1-jpg.webp)
రాజ్యసభలో మహిళా బిల్లు చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతంది. ప్రస్తుతం దీని మీద మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇందులో మొట్టమొదటగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు బిల్లు అమలులో కేంద్రం అంచనా తప్పుగా వేసిందన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్, ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ పూర్తి కావాలంటే 2030 వరకు పడుతుంది. అంటే.. 2029మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అసాధ్యం. అంతలేటు చేసేకన్నా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ చేస్తే బిల్లు వెంటనే అమలు చేసే ఆస్కారం ఉంటుందని కేశవరావు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే జనాభా లెక్కలు అనడం అర్థరహితం అని ఆయన విమర్శించారు.
వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అయితే.. న్యాయ శాఖ మంత్రిత్వ శాఖకు మా విజ్ఞప్తి ఒక్కటే. మహిళా రిజర్వేషన్‌లను రాజ్యసభ, శాసన మండళ్ళకి కూడా అమలు చేయాలి. ఆర్టికల్ 80, 171 చట్ట సవరణ ద్వారా రాజ్యసభ, శాసనమండళ్లల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్ కల్పించాలి. రాజకీయాల్లో మహిళా సాధికారతను పెంపొందించే ఈ సెప్టెంబర్ నెలను మహిళల చారిత్రక నెలగా ప్రకటించాలని కోరుతున్నామన్నారు విజయసాయిరెడ్డి.
స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలకు అవకాశం ఇచ్చిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్‌దే అని చెప్పుకొచ్చారు. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ 33 శాతం కాదు 50 శాతం ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైసీపీకి చెందిన మరో ఎంపీ పిల్లి సుభాష్.
మరోవైపు అసలు మాకు ఈ బిల్లు వద్దే వద్దు అంటూ మహిళా రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు స్థానం కోసం తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశామని, ఎవరికోసమైతే దీనిని తెస్తున్నారో
వారికే బిల్లులో చోటు లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఓబీసీ జనాభా ఉంటే.. వారికి చట్టసభల్లో కేవలం 22 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. దేశ జనాభాలో ముస్లిం మహిళల వాటా 7 శాతం, కానీ లోక్‌సభలో ముస్లిం ఎంపీలు 0.7 శాతం మందే ఉన్నారని అసదుద్దీన్ చెప్పారు. అలాంటప్పుడు వారికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరు? అని ఆయన నిలదీశారు.