/rtv/media/media_files/2025/10/12/konda-surekha-vs-ponguleti-2025-10-12-07-10-22.jpg)
Konda Surekha vs Ponguleti
Konda Surekha vs Ponguleti : వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడు వివాదాల్లో ఉండే కొండా సురేఖ ఆమె భర్త మరోసారి తమ నిరసన గళం విప్పారు. గతంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ విషయం పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఇరువర్గాలకు పార్టీ నాయకత్వం సర్ధిచెప్పింది. అయితే తాజాగా మరోసారి సురేఖ దంపతులు పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చినంత పనిచేశారు. తన శాఖతో పాటు, తమ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ దేవాదాయశాఖమంత్రిగా ఉన్న కొండా సురేఖతోపాటు ఆమె భర్త భర్త కొండా మురళి పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పీఆర్‌ఓ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదివరకే కొండా మురళి పార్టీ కేంద్ర నాయకులకు ఫిర్యాదు చేసినట్లు తెలియగా తాజాగా సురేఖ సైతం ఫిర్యాదు చేసినట్లు పీఆర్‌ఓ తెలిపారు. వరంగల్ రాజకీయాల్లో పొంగులేటి జోక్యం మితిమీరుతోందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కార్యాలయానికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులకోసం పిలిచిన టెండర్లలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని వారు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. వారితో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు కూడా పొంగులేటిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
‘సీనియర్ ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా ఉన్న.. మాకు ఆత్మాభిమానం ఉండొద్దా?’ అని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్ఠానం దగ్గర తన ఆవేదనను వెలిబుచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తమపై ఆధిపత్యం చలాయించడమే పొంగులేటి పనిగా పెట్టుకున్నారని ఆమె మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతుంది. వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ దంపతులకు వ్యతిరేక వర్గాన్ని పెంచిపోషిస్తున్నారని వారు పార్టీ అధిష్ఠానం వద్ద వాపోయారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఇన్‌చార్జి మంత్రి అనే సాకుతో అన్నిట్లో జోక్యం చేసుకుంటున్నారని, మేడారం పనుల టెండర్లను పిలవడంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తాను గతంలో. ఇప్పుడూ ఇతర జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రిగా కొనసాగుతున్నానని, తానెప్పుడు ఇతరుల శాఖలపై పెత్తనం చెలాయించలేదని, కానీ, మంత్రి పొంగులేటి మాత్రం అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా పొంగులేటి విషయమై పార్టీ అధిష్ఠానానికి పోన్ ద్వారా ఫిర్యాదు చేసిన కొండా దంపతులు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం వద్ద తమ మొరను వెళ్లబోసుకునేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది.
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య