/rtv/media/media_files/2025/06/06/AVCWumMyGVjS8527fQYX.jpg)
Telangana Local Body Elections
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) లేదా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం, ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది.
ఎన్నికల కోడ్ ఎందుకంటే?
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలనే ‘‘మోడల్ ఆఫ్ కండక్ట్’’ అని అంటారు.ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే, ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవచ్చు.ఈ నియమాలను ఉల్లంఘించినవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును దాఖలు చేయవచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రవర్తన, ఎన్నికల సభ, ర్యాలీ, ఊరేగింపు, రోడ్ షోలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉంటాయి. వీటితో పాటుగా ఓటింగ్ రోజున పార్టీలు, వాటి అభ్యర్థుల ప్రవర్తన, పోలింగ్ బూత్ క్రమశిక్షణ, ఎన్నిక సమయంలో పరిశీలకుల పాత్ర, అధికార పార్టీ పాత్రల గురించి ప్రస్తావించారు.
హైదరాబాద్​, మేడ్చల్​-మల్కాజిగిరి మినహా మిగతా జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యాంశాలు ఇవే :
-ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలి.స
-కోడ్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్‌లు ఉపయోగించరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు జరపకూడదు.
-మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక గ్రాంట్‌లను, వాటికి సంబంధించిన వాగ్దానాలను ప్రకటించకూడదు.ఎక్కడ శంకుస్థాపనలు చేయడానికి వీలేదు. మంత్రులు అధికారిక యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించరాదు.
-ఎవరైనా అధికారి, సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్-218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలి.
-ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు/చెల్లింపులను మంజూరు చేయరాదు.
-గృహ నిర్మాణ పథకం మంజూరై, పని ప్రారంభిస్తే, లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందాలి. ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదా కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయరాదు.
-ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఉద్యోగ కార్డుదారులు పనిని డిమాండ్ చేస్తే, కొనసాగుతున్న పనిలో వారికి ‘ఉపాధి హామీ’లో పనిని కల్పించవచ్చు. కొత్త పనిని ప్రారంభించకూడదు.
-కరవు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్‌ఈసీ అనుమతితో ప్రభుత్వం నిర్వహించాలి.
రూ.50 వేలకు మించి నగదుతో జాగ్రత్త :
తెలంగాణలో స్థానిక ఎన్నికల కోడ్​ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలను సోదా చేస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డబ్బు ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్​ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు.
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో ఆధారాలు చూపలేకపోయినా, తర్వతా ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా మొదలైంది?
1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ మొదలైంది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అంగీకారం తెలిపిన తర్వాతే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. ఇందులో ఎలాంటి నిబంధనల్ని పాటించాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు.
1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత, 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తనా నియమావళిని అనుసరించారు. తర్వాత దీనికి మరిన్ని నిబంధనలు జోడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనేది ఏ చట్టంలోనూ భాగం కాదు. అయితే, ఎన్నికల కోడ్‌లోని కొన్ని నిబంధనలు, ఐపీసీ సెక్షన్ల ఆధారంగా అమలు అవుతాయి.
ఎన్నికల కోడ్‌ను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రతీ ఎన్నికల్లోవాటి ఉల్లంఘనకు సంబంధించిన ఉదాహరణలు వెలుగులోకి వస్తుంటాయి.
Follow Us