/rtv/media/media_files/2025/08/05/weather-update-2025-08-05-07-19-06.jpg)
Weather Update
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాబోయే కొద్ది రోజులు వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు దేశం నుండి పూర్తిగా వెళ్లిపోయినప్పటికీ.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించడం వల్ల రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలను వెల్లడించింది. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలను ప్రకటించింది. ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం వంటి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తీర ప్రాంతాలలో గంటకు 35 నుంచి 45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరీ ముఖ్యంగా చెట్లు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పొడి వాతావరణం, ఎండ తీవ్రత ఉన్నప్పటికీ.. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలను ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ వంటి తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు, దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా ఈ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 27°C, కనిష్ఠంగా 17°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని.. రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడి, తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.