/rtv/media/media_files/2025/02/03/bHt6935i5w8REz191FJ3.jpg)
Vasant Panchami
Vasant Panchami : వసంతపంచమి కావడంతో సోమవారం తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో జ్ఞానసరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లా బాసరలో భక్తులు పోటెత్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు విద్యాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల విశ్వాసం. చాలామంది తల్లిదండ్రులు ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షరాభ్యాసాలు ఈ రోజు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఫిబ్రవరి 02 ఆదివారం మధ్యాహ్నం నుంచి పంచమి తిథి మొదలైంది.. ఫిబ్రవరి 03 సోమవారం ఉదయం 10.15 వరకు మాత్రమే ఉంది.సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి..వసంతపంచమి ఫిబ్రవరి 03 సోమవారమే జరుపుకోవాలి. అయితే అక్షరాభ్యాసాలు నిర్వహించేవారు, ప్రత్యేక పూజలు చేసేవారు ఉదయం పది గంటల లోపే ముగించుకోవడం మంచిది. ఆ తర్వాత పంచమి తిథి పూర్తై షష్టి మొదలవుతుంది. ఆదివారం కూడా కలిసిరావడంతో నిన్ననే పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటీ సంచలన ప్రకటన
సోమవారం కూడా రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారుజామునుంచే దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాధారణంగా శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆ రోజు అమ్మవారి జన్మనక్షత్రం అని విశేష పూజలు చేస్తారు. అయితే మాఘ గుప్త నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి సరస్వతీ దేవి ఆరాధానకు మరింత ప్రత్యేకం అంటారు పండితులు. మాఘమాసం మొదలైన తర్వాత ఐదో రోజు వచ్చే రోజు వసంత పంచమి. జనవరి 30నుంచి మాఘమాసం ప్రారంభమైంది..పాడ్యమి, విదియ, తదియ, చవితి..ఐదో రోజు పంచమి. ఈ ఏడాది ఫిబ్రవరి 03న వచ్చింది. ఈ రోజునే శ్రీ పంచమి, సరస్వతి పంచమి, మదన పంచమి , వసంతోత్సవం అని కూడా పిలుస్తారు.
Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బాసర సరస్వతి క్షేత్రానికి ప్రత్యేకత ఉంది. వ్యాసమహర్షి బాసర క్షేత్రంలో వసంత పంచమి రోజే ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఈ విషయం బ్రహ్మాండపురాణంలో కూడా స్పష్టంగా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మనసు చలించిన వ్యాసుడు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకు గోదావరీ తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట. నదిలో స్నానమాచరిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై..ఇసుకతో తన విగ్రహాన్ని తయారుచేసి పూజించమని ఆజ్ఞాపించారని చెబుతారు. అలా నిత్యం పిడికెడు ఇసుక తీసుకుని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొంచించారు వ్యాసమహర్షి. అదే ఇప్పుడు కనిపించే మూలవిరాట్టు అని చెబుతుంటారు. ఆ మూల విరాట్టుకి నిత్యం పసుపు రాస్తూ పూజలందిస్తుంటారు అర్చకులు. బాసరలో సరస్వతీ విగ్రహానికి సమీపంలో మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలూ ఒకేచోట కొలువై ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుంది. బాసర ఆలయంలో అమ్మవారి విగ్రహం వ్యాసమహర్షి రూపొందించడం వల్ల ఈ ప్రదేశానికి వ్యాసర అని పేరు..కాలక్రమేణా వ్యాసర బాసరగా మారిందని చెబుతారు.
ఘనంగా ఏర్పాట్లు
అక్షరాభ్యాసం కోసం భక్తులు వేలాదిగా తరలిరానుండటంతో ప్రభుత్వం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిర్మల కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోదావరి పుష్కర ఘాట్ వద్ద బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. నదిలో స్నానం చేసిన భక్తులకు అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని, గజఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని, రాత్రిపూట విద్యు త్ దీపాలను అమర్చాలని తెలిపారు.గోదావరి పుష్కర ఘాట్, ఆలయ పరిసరాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచారు. 108, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు.మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి డాక్టర్లను, సిబ్బందిని, మెడిసిన్ అందుబాటులో ఉంచామన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుంచి భక్తులు ఆలయానికి ఈజీగా చేరుకునేందుకు రూట్ మ్యాప్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.