/rtv/media/media_files/2025/11/07/bandi-sanjay-2025-11-07-07-06-40.jpg)
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కరీంనగర్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ATMగా మార్చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల దోపిడి వల్ల సింగరేణి ప్రస్తుతం రూ.42 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి సింగరేణిలో లూటీ జరిగిందని, కేసీఆర్ కుటుంబం సంస్థను దోచుకుందని మండిపడ్డారు. సింగరేణిలో అవకతవకలకు సంబంధించిన రికార్డులను ప్రభుత్వం వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సింగరేణిపై విచారణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని, అప్పులు చెల్లించి సంస్థను కాపాడుకోవాలని సూచించారు.
Also Read: మేడారం.. భక్తజన గుడారం.. ఒక్కరోజే 3 లక్షలమంది దర్శనం
కేసీఆర్ కుటుంబానికి సవాల్
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది విచారణలా కాకుండా టీవీ సీరియల్ లాగా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. "ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేసీఆర్ కుటుంబం తన కుటుంబంతో సహా వచ్చి దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా?" అని ఆయన సవాల్ విసిరారు. గతంలో తాను విసిరిన సవాల్ నుంచి వారు తప్పించుకున్నారని గుర్తు చేశారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగానే ఈ ట్యాపింగ్ అరాచకాలు జరిగాయని, నా ఫోన్‌ను కూడా టెర్రరిస్టుల జాబితాలో పెట్టి ట్యాప్ చేశారని ఆరోపించారు. సిట్ అధికారులు సమర్థులని, కానీ ప్రభుత్వం వారికి స్వేచ్ఛనివ్వడం లేదని విమర్శించారు. కేవలం వాంగ్మూలం పేరుతో కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు.
Also Read: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..
రాబందుల నుంచి సింగరేణిని కాపాడుతాం
తాను ఆస్తులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తున్నానని సంజయ్ స్పష్టం చేశారు. సింగరేణి ఆస్తులపై వాలుతున్న రాబందులు, గద్దల నుంచి సంస్థను కాపాడతామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణికి పూర్వవైభవం తీసుకువస్తామని, దోచుకున్న దొంగల అరాచకాలను బయటపెడతామని ధీమా వ్యక్తం చేశారు.
Follow Us