/rtv/media/media_files/2025/07/16/drugs-2025-07-16-10-08-27.jpg)
డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రేటీలతో పాటుగా తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కొడుకు మోహన్‌లను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్- ఈగల్ బృందాలు అరెస్టు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఇద్దరు యువకులు డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మల్నాడు కిచెన్ యజమాని సూర్యతో కలిసి డ్రగ్స్ దందాలో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరు డ్రగ్స్ విక్రయాలు, వినియోగలలో పాలుపంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పట్టుబడిన ఇతర నిందితులను పోలీసులు విచారించగా, రాహుల్ తేజ, మోహన్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్స్ సరఫరాలో, డ్రగ్స్ పార్టీలు నిర్వహించడంలో ముఖ్య పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.
తండ్రుల హోదాను ఉపయోగించుకొని
సూర్య కాల్ లిస్టులో డ్రగ్స్ డీల్‌లో పలువురి నెంబర్లు బయటపడ్డాయి. దీంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు యువకులు తమ తండ్రుల హోదాను ఉపయోగించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులో ఎవరెవరు పాల్గొన్నారు, వారి పాత్ర ఏమిటి అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇక ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఇప్పటికే పదికి చేరింది. సూర్యతోపాటు హర్ష, యశ్వంత్, జశ్వంత్, నవదీప్, పవన్, రాహుల్, ఫుడ్ బ్లాగర్ సూర్య, తేజ, మోహన్‌లను ఈగల్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.
సూర్య తరచుగా డ్రగ్స్ తీసుకోవడానికి అనుమతించిన తొమ్మిది పబ్‌లపై ఇప్పటికే సైబరాబాద్ ఈగల్ టీం కేసులు నమోదు చేసి, నోటీసులు కూడా జారీ చేసింది. వాస్తవానికి రాహుల్ తేజపై గత ఏడాది నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓ డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో అతను ఏ3గా ఉన్నారు. తేజ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ నిజామాబాద్ పోలీసులు మాత్రం తేజపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.