Panchayat Elections: నేడే తొలివిడత పంచాయతీ ఎన్నికలు..ఒంటిగంట వరకే పోలింగ్‌

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలు మిగిలిన ఎన్నికల్లాగా సాయంత్రం 5 గంటల వరకు ఉండవు. ఉదయం పూట ఒంటిగంట వరకే ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది.

New Update
Sarpanch Elections

Sarpanch Elections

Panchayat Elections:  పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కాగా, ఈ ఎన్నికలు మిగిలిన ఎన్నికల్లాగా సాయంత్రం 5 గంటల వరకు ఉండవు. అందుకే మధ్యాహ్నం లేదా సాయంత్రం వేద్దాం లే అని పనులకు వెళ్దాం అనుకుంటే కుదరదు. తప్పకుండా ఉదయం పూట ఒంటిగంట వరకే ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది.
  
ఒంటి గంట వరకే పోలింగ్

ఈసారి పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతుంది. అప్పటివరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఎన్నికైన వార్డు సభ్యులు ఉప సర్పంచ్​లను ఎన్నుకుంటారు.  

పోలింగ్‌ సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే.

అర్హులు : ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్నవారు మాత్రమే.


ఈ గుర్తింపు కార్డులు తప్పనిసరి

ఓటరు గుర్తింపు కార్డు పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాలి. అది లేని పక్షంలో ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లెసెన్స్‌, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, ఫొటో ఉన్న బ్యాంక్‌ లేదా పోస్టాఫీసు ఖాతాపాస్ బుక్‌, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షన్‌ పొందే గుర్తింపు కార్డు ఆర్జీఐ (రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) జారీ చేసిన స్మార్ట్‌ కార్డులను మాత్రమే పరిగణన లోకి తీసుకుంటారు.

రెండు రంగులు : ఒక్కో వార్డుకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తుండగా సర్పంచ్‌ అభ్యర్థి, వార్డు అభ్యర్థిగా ఒకేసారి ఓటువేసే అవకాశం కల్పిస్తారు.సర్పంచ్‌ అభ్యర్థికి గులాబి రంగు, వార్డు అభ్యర్థికి తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలు అందజేస్తారు. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్‌ ముద్రవేసి ఒకే బ్యాలెట్‌ డబ్బాలో వేయాల్సి ఉంటుంది.

బ్యాలెట్‌ పద్ధతిలో : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తున్న విషయం విదితమే. అయితే  గ్రామపంచాయతీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఒక్కో పంచాయతీలో ఒక ఓటు సర్పంచ్‌కు, మరో ఓటు వార్డు సభ్యుడికి.. ఇలా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్లకు అందజేసే బ్యాలెట్‌ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్‌ అభ్యర్థులకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయి. బ్యాలెట్‌ పత్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. సర్పంచ్‌ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు.

నోటా గుర్తు : బ్యాలెట్‌ పత్రం చివరలో నోటా గుర్తు ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్‌ చివరిలో నోటాను వినియోగిస్తున్నారు. పై అభ్యర్థులు నచ్చకపోతే ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. ఒక్క బ్యాలెట్‌ పేపర్లో ఎనిమిది గుర్తులతో పాటు చివరలో నోటా గుర్తుకు స్థానం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య దాటితే మరో బ్యాలెట్‌ పేపర్‌ జతచేస్తారు. అంటే ఎక్కడైనా ఎనిమిది మందికి మించి బరిలో ఉంటే అదనపు బ్యాలెట్‌ వినియోగిస్తారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. బ్యాలెట్‌ బాక్సులు, ఇతర పోలింగ్‌ సామగ్రిని సంబంధిత సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

లెక్కింపు : ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్‌ బాక్సును వరుసగా తెరుస్తారు. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తారు. ఎవరికీ ఓట్లు ఎక్కువ వస్తే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. 

ఉప సర్పంచ్ ఎన్నిక : ఇక గెలిచిన వార్డు సభ్యులందరూ సమావేశమై వారిలో ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు. సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ ఏదేని కారణాల చేత సర్పంచ్ సస్పెండ్ కావడం లేదా మరణించడం జరిగితే ఉప సర్పంచ్ కు సర్పంచ్ గా అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కు కూడా చెక్ పవర్ ఉంటుంది.

పంపకాల్లో అభ్యర్థులు
పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగారు. మరోవైపు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు పంచుతున్నట్టు తెలుస్తోంది. మద్యం ఏరులై పారుతోంది. పలు గ్రామాల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చీరలు పంచుతున్నారు.

Advertisment
తాజా కథనాలు