/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t064742-2026-01-18-06-54-03.jpg)
Kalyan Ram pays tribute to grandfather NTR (old pic)
NTR Death Anniversary: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, నటుడు కళ్యాణ్‌రామ్ ఈ రోజు తెల్లవారుజామునే తాత సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆయన వెంట అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సమాధివద్ద పూలు ఉంచి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కాగా ఎన్‌టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా భారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అటు, ఏపీతో పాటు హైదరాబాద్‌లోనూ ఆయన అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పలుచోట్ల అన్నదానాలు. రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళి అర్పించేందుకు సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ అంత టా వివిధ కార్యక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని పార్టీశ్రేణులు రూపకల్పన చేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతోపాటు పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహణ, పెద్దఎత్తున అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏపీలోనూ..
నందమూరి తారకరామరావు 30 వర్థంతి సందర్భంగా అధికార కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, నాయకులు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.ఎన్టీఆర్ కళాపరిషత్ పేరుతో జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు ఒంగోలులో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ప్రదర్శనలు ఈ ఏడాది కూడా జరగనున్నాయి. నగరంలోని పీవీఆర్ స్కూలు అవరణలో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వచ్చేనెల 3 వరకు సాగనున్నాయి. కాగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని పార్టీ శ్రేణులంతా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కోరారు.
కర్నూలులో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి స్మారకంగా, జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు ఈనెల 18, 19 తేదీల్లో టీజీవి కళాక్షేత్రంలో జరగనున్నాయి. ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా కళాకారులు పాల్గొంటారని నిర్వాహక కార్యవర్గ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతిగా రూ. 5016తో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Follow Us