Maoist Ganapati : మావోయిస్టు గణపతి కోసం వేట...ఏ క్షణమైన...

ఆఫరేషన్‌ కగార్‌ తో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు పోలీసులు,ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ ​గణపతి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

New Update
FotoJet (6)

Maoist party ganapathy

Maoist Ganapati : దేశంలో మావోయిస్టు ఉద్యమం తెరమరుగు కానుంది. ఆఫరేషన్‌ కగార్‌ తో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు పోలీసులు,ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో మావోయస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ ​గణపతి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఇటీవల లొంగిపోయిన పలువురు అగ్రనేతలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన నేపాల్‌లో ఉన్నట్లు ప్రచారం సాగింది. దీంతో ఆయన కోసం తెలంగాణ పోలీసులు నేపాల్‌ లో ఉన్నాడని, పోలీసులకు టచ్‌లోకి వచ్చాడని, ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోతాడని ఒక్కటే ప్రచారం సాగింది. అయితే ఇంతవరకు ఆయన ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దేశంలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నప్పటికీ నలభై ఐదేండ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించి, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిన గణపతి దొరికితేనే మావోయిస్టు ఉద్యమానికి తెరపడినట్లని ప్రభుత్వాలతో పాటు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో గణపతి ఆచూకీ కోసం వేట సాగిస్తున్నారు. 

మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో గణపతి గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన క్రమంలో గణపతిని కూడా లొంగిపోయేలా చూడాలని తెలంగాణ పోలీసులకు అమిత్‌ షా సూచించారని సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా గణపతి లొంగిపోవాలని కోరడంతో పాటు ఆయనకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఆచూకీకోసం తెలంగాణ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
 
పీపుల్స్ వార్‌ నుంచి మావోయిస్టు వరకు..

కాగా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా 2018లో మావోయిస్టు నాయకత్వం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ఆయన అప్పటి వరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య నుంచి నాయకత్వాన్ని చేజిక్కించుకున్న గణపతి సుమారు నాలుగున్నర దశాబ్ధాల పాటు పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. జగిత్యాల జైత్రయాత్ర, రైతాంగ పోరాటాలతో సీపీఐ ఎంల్‌  పీపుల్స్‌వార్‌గా మొదలైన మావోయిస్టు ఉద్యమం ఆ తర్వాత మరికొన్ని వామపక్ష పార్టీల విలీనంతో సీపీఐ మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణ భూస్వామ్య వ్యతిరేక పోరాటం నుంచి పురుడుపోసుకున్న మావోయిస్టు పార్టీ ఆ తర్వాత దేశంలోని 12 రాష్ర్టాల్లో వేళ్లూనుకుపోయింది. మావోయిస్టు ఉద్యమం గణపతి కనుసన్నల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయన నాయకత్వంలో వేలాది మంది మావోయిస్టులు ఉద్యమంలో భాగమవ్వగా జనాతన సర్కార్‌ పేరుతో ప్రత్యమ్నాయ పాలనను కూడా గణపతి నేతృత్వలోనే కొనసాగింది. ఆయన నాయకత్వం నుంచి తప్పుకుని నంబాళ్ల కేశవరావుకు అప్పగించినప్పటికీ పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో గణపతిదే తుది నిర్ణయం. అయితే  ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆఫరేషన్‌ కగార్ పేరుతో మావోయిస్టు ఉద్యమ నిర్మూలనకు నడుం బిగించడంతో ఎందరో అగ్రనాయకులు అశువులు బాశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిన నాయకత్వమంతా లొంగుబాటు బాట పట్టక తప్పలేదు. ఇక ఇపుడు గణపతి వంతు వచ్చింది.

 నేపాల్‌లోనే ఉన్నాడా?

మావోయిస్టు పార్టీని 12 రాష్ర్టాలకు విస్తరించి ఎన్నో బలమైన ఆఫరేషన్లకు నాయకత్వం వహించిన గణపతి వయసు ప్రస్తుతం 77 సంవత్సరాలు. దీంతో ఆయన అడవుల్లో తరుచుగా నడవటం, షెల్టర్లు మార్చడం, శతృవు బారి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నాయకత్వం నేపాల్‌కు పంపినట్లు తెలుస్తోంది. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో అగ్రనాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ గణపతితో టచ్‌లో ఉందా? లేదా అనేది ప్రస్తుతం లొంగిపోయిన వారి నుంచి సమాచారం రావలసి ఉంది.  దీనికోసం ఇటీవల లొంగిపోయిన అగ్రనేతల నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో ఆయనకు వ్యక్తిగత గన్‌మెన్లుగా, సహాయకులుగా పనిచేసిన వారు కూడా ఉండటంతో వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే పోలీసుల కూంబింగ్‌ నేపథ్యంలో ఆయనను నాయకత్వం అబూజ్ మడ్‌ నుంచి బిహార్‌కు తరలించిందని, అక్కడి నాయకత్వం ఆయనను ఎక్కడికి తరలించిందో  అన్న సమాచారం మాత్రం లేదని లొంగిపోయిన నాయకులు తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన నేపాల్‌లోనే ఉన్నారని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో గడచిన 8నెలల కాలంలో ఆయనతో ప్రస్తుత నాయకులెవరూ టచ్‌లో లేనట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఆఫర్‌

ఒకపుడు తెలంగాణలోనే పురుడు పోసుకున్న మావోయిస్టు ఉద్యమం ఇక్కడే భూస్థాపితం అవుతుందనడంలో సందేహం లేదు. అగ్రనాయకులంతా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో రాష్ర్ట ప్రభుత్వం గణపతి లొంగుబాటును కూడా తమ ఖాతాలోనే వేసుకుని కేంద్రం వద్ద క్రెడిట్‌ కొట్టేయ్యాలని చూస్తోంది. దీంతో ఆయన లొంగిపోయేలా చూడాలని 
ప్రస్తుతం లొంగిపోయిన నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఆయన జనజీవన స్రవంతిలో కలిస్తే  మావోయిస్టులకు ఇచ్చే పునరావాస ప్యాకేజీతో పాటు ఆరోగ్య భద్రత కార్డు కల్పిస్తామని రేవంత్​ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అంతేకాక నిమ్స్​ వంటి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందే ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారి హోదాలకు తగినట్లు ప్యాకేజీ కల్పించడం, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య భద్రతా కార్డు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వ్యవసాయ భూమి కావాలని మావోయిస్టులు అడగగా అది సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే లొంగిపోయిన నాయకులు రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. రాష్ర్ట ప్రభుత్వ హామీతో గణపతి ఆచూకీకోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం.త్వరలోనే ఆయనను పట్టుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు