/rtv/media/media_files/2025/09/26/brs-working-president-ktr-2025-09-26-17-47-12.jpg)
BRS Working President KTR
KTR : మెట్రో ప్రాజెక్టు నిర్వాహణ నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకోవడానికి కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన ఫిల్లర్లను తామే బాగుచేస్తామని ఎల్‌అండ్‌టీ అనడమే రేవంత్‌కు కోపం తెప్పించిందని అందువల్లే ఆ సంస్థను మెట్రోనుంచి తప్పించారని తీవ్రంగా ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో దశల వారీగా మెట్రో విస్తరణకు గతంలో కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని తెలిపారు. తాము దిగిపోయే నాటికి హైదరాదాబాద్ మెట్రో దేశంలో రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని గుర్తు చేశారు. మెట్రోను ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని తాము అనుకున్నామని కానీ, రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రోను రద్దు చేశారని అన్నారు. నిర్మాణ పనులు చేపట్టి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది అని కేటీఆర్ తెలిపారు.
ఎయిర్ పోర్టు దారిలో కేటీఆర్ భూములు ఉన్నాయని అందుకే అక్కడి వరకు ప్రాజెక్టు విస్తరిస్తున్నారని ప్రచారం చేసి ఆ ప్రాజెక్టును రద్దు చేశారని ఆరోపించారు. అప్పటినుంచే ఎల్ అండ్ టీకి ప్రభుత్వానికి మధ్య పంచాయతీ మొదలైందన్నారు. ఎల్ అండ్ టీ మెట్రో నుంచి ఎందుకు వెళ్లిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్‌కు ఇది మాయని మచ్చ అని చెప్పారు. ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోను జైలులో వేయాలని రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమైన విషయమని అన్నారు. పెట్టుబడిదారులను బెదిరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలవల్ల ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని విమర్శించారు.
బెదిరింపులు, ముడుపుల కోసం ముఖ్యమంత్రి వేధింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్&టీ సంస్థ వైదొలుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలు ఎందుకు ఉంటాయని కేటీఆర్ ప్రశ్నించారు. త్వరలో వివాదాస్పదమైన ఎంఆర్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మబోతున్నారని, ఇందులో ఆయన ఎంత కమిషన్ తీసుకున్నారో తెలుస్తుందని అన్నారు. గతంలో పలు కంపెనీలపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని, అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాల్సిందిపోయి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాల్సిందిపోయి పక్కన పెట్టారని విమర్శించారు.
హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వం చేతిలోకి రానుంది. మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రమణ్యన్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. గత కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాయాలపై చర్చలు జరగగా... గురువారం జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్ అండ్ టీ తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మరో రూ.2 వేల కోట్లను ఎల్ అండ్ టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకంగా మారనుంది. ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని, ఇది పూర్తయితే దేశంలో ఉన్న 23 మెట్రోలలో ప్రైవేటు రంగం చేతిలో ఉన్న ఒకే ఒక మెట్రో కూడా ప్రభుత్వం చేతికొచ్చినట్లు అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి