/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t095129-2026-01-14-09-51-57.jpg)
15th Finance Commission funds
15th Finance Commission funds : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రూ. 2,500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లూ నిధులు లేక.. చిన్న చిన్న సమస్యలను తీర్చలేక సతమతవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యను తీర్చనుంది. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పంచాయతీలకు రావాల్సిన సుమారు రూ.2500 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోపు కనీసం రూ.వెయ్యి కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లు తెలిసింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది.
సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి, డిజిటల్ సిగ్నేచర్లతో పనులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పల్లెల్లో కొత్త వెలుగులు సంతరించుకోనున్నాయి.రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసి.. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో నిధుల విడుదలకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ. 2,500 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.277 కోట్లు కూడా..
రాష్ట్రంలో 2024 జనవరిలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. అయితే గత నెలలో ప్రభుత్వం విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి నివేదిక సమర్పించగా.. సానుకూలంగా స్పందించిన కేంద్రం నిధులను మంజూరు చేసింది. దీనికి తోడు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా రూ. 277 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కఠిన విధివిధానాలు
కాగా ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవడానికి కేంద్రం కఠినమైన విధివిధానాలను నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేకబ్యాంకు ఖాతాను ప్రారంభించి, దానిని పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ,ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. నిధుల చెల్లింపుల కోసం సర్పంచి (చెకర్), ఉపసర్పంచి (మేకర్) కచ్చితంగా క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు పొందాలి. వీటిని ఎంపీడీవోల ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. పనులన్నీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ లేదా టెండర్ విధానాల ద్వారానే నిర్వహించాలని, అవసరమైన రిజిస్ట్రేషన్లను జీఈఎం పోర్టల్‌లో పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.నిధుల వినియోగానికి మేకర్, చెకర్‌గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను ఈ గ్రామ్​ స్వరాజ్‌లో నమోదు చేసి సంబంధిత ఎంపీడీవో ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఉప సర్పంచ్ కీలక పాత్ర
కాగా నిధుల విడుదల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ మేకర్‌గా, సర్పంచ్ చెకర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరోసారి తెలిపింది. ఈ ప్రక్రియకు క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి కాగా, సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యంతో పాటు యూఎస్​బీ టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీల అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జీఈఎం పోర్టల్, ఈ ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా వెంటనే సేకరించి, నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్ని జిల్లాల పంచాయతీల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిధుల విడుదలకు మార్గం సుగమం
రాష్ట్రంలో గతంలో గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు. గతనెలలో ఎన్నికలు పూర్తవడంతో కేంద్రానికి నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అధికారులు నిరంతర సంప్రదింపులతో నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు, కొత్త పనులు ప్రారంభం కానున్నాయి. కొత్త పాలకవర్గాల ఆధ్వర్యంలో గ్రామ సమస్యలు తీరనున్నాయి.
Follow Us