/rtv/media/media_files/2025/04/30/p5Edl8Y1S3MbwqKCb7iD.jpg)
hunagathurthy MLA Mandula Samuel
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా పలువురు నేతలు ఆందోళనకు దిగారు. ఏళ్ల నుంచి పార్టీలో పని చేస్తున్న తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులోనూ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దగ్గరకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని సభకు హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను కోరారు. దీంతో మీటింగ్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించడంతో మీటింగ్ కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర పదవులను మొదటి నుంచి కాంగ్రెస్ లో పని చేసిన వారికే ఇచ్చినట్లు చెప్పారు.
సొంత ఎమ్మెల్యే మందుల సామేల్‌పై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు..
— Telangana Awaaz (@telanganaawaaz) April 30, 2025
మందుల సామేల్ గెలుపు కోసం కష్టపడ్డ తమను ఆదరించడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..
తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మందుల సామేల్..
నీ గెలుపు… pic.twitter.com/MSDHjhXGpA
సామేల్ Vs దామోదర్ రెడ్డి..
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గతంలో తుంగతుర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో సూర్యాపేటకు మకాం మార్చారు. అయినా.. దామోదర్ రెడ్డే తుంగతుర్తిలో పార్టీని నడిపిస్తున్నారు. మండల కమిటీలు, గ్రామ కమిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇలా ప్రతీ విషయంలోనూ ఆయన వర్గానిదే ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే.. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని విజయం సాధించిన మందుల సామేలుపై దామోదర్ రెడ్డి వర్గం కొన్ని రోజుల నుంచి ఆగ్రహంగా ఉంది.
ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సామేలు పాత కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి తుంగతుర్తిలో ప్రజాదర్బార్ నిర్వహించి కార్యకర్తలకు అండగా ఉంటారని ఇటీవల దామోదర్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. నియోజకవర్గానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ సైతం మందుల సామేల్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తుంగతుర్తి కాంగ్రెస్ విభేదాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటాయి? అన్న అంశంపై జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
(revanth-reddy | mla mandula samuel | telugu-news | telugu breaking news)