Organ Donation: తెలంగాణా గ్రేట్.. దేశంలోనే నెం.1

అవయవ దానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2024లో 188 మంది డోనర్ల నుంచి, 725 అవయవాలను ఇతరులకు అమర్చామని తెలిపారు.

New Update
TG organ donation

Organ Donation

అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇందులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణకు నేషనల్‌ ఆర్గాన్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ (NOTTO) అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో శనివారం జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ‘జీవన్‌దాన్‌’ ప్రతినిధులకు అవార్డు అందజేశారు. కాగా, అవయవ దానాల్లో తెలంగాణకు అవార్డు రావడంపై మంత్రి రాజనర్సింహ హర్షం వ్యక్తంచేశారు. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్‌దాన్ ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా కాకుండా.. దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవమార్పిడి చికిత్సను అందిస్తున్నామన్నారు. 2024లో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి, 725 అవయవాలను ఇతరులకు అమర్చామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2012లో "జీవన్‌దాన్" కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా బ్రెయిన్ డెత్ గా ప్రకటించబడిన వ్యక్తుల నుంచి అవయవాలను సేకరించి అవసరమైన వారికి సమర్ధవంతంగా అమర్చే విధానాన్ని ఏర్పాటుచేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారందరికీ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించబడింది.

Advertisment
తాజా కథనాలు