/rtv/media/media_files/2025/02/15/F0B67Fhi4OkJepcnoOXD.jpg)
సిర్పూర్-కాగజ్‌నగర్ కాంగ్రెస్‌లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్‌ను క్యాన్సిల్ చేయడంపై కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారు.. మీకు అంత సీన్ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఎవరికీ భయపడనని కూడా తేల్చిచెప్పారు. గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన విషయం కూడా గుర్తు చేశారు. సీఎంను కలిసి చాలా సార్లు ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని చెప్పినా.. స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి..
కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. అయితే.. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే.. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురై కాంగ్రెస్ గూటికి చేరారు కోనప్ప.
తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీని ఓ దొంగల కంపెనీ అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? అన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ పెద్దలు కోనప్పతో మాట్లాడి.. ఆయనను శాంతిపజేస్తారా? కోనప్ప నెక్స్ట్ స్టెప్ ఏంటి? అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.