/rtv/media/media_files/2024/10/16/CPcSDlH4FFXJhANOus3H.jpg)
దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై సమాధానం (కౌంటర్) దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 45పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల (PIL) విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2006 నుంచి ఈ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం తప్పుపట్టింది. గత అక్టోబర్‌లో ఇచ్చిన 'చివరి అవకాశం' కూడా ప్రభుత్వం వినియోగించుకోకపోవడంతో, ప్రతి పిటిషన్‌కు రూ.5,000 చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి జనవరి 9 వరకు తుది గడువు ఇచ్చింది. ఒకవేళ ఆ తర్వాత ఇచ్చే కౌంటర్లను స్వీకరించవద్దని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
కొత్త కోర్టు భవన నిర్మాణం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న కొత్త హైకోర్టు భవన నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. సుమారు రూ.2,583 కోట్ల భారీ వ్యయంతో 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. న్యాయాధికారుల సూచనల మేరకు ప్లాన్లలో మార్పులు చేసి, తుది డ్రాయింగ్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ కన్సల్టెంట్‌లను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా ముందస్తు షెడ్యూల్‌ను సిద్ధం చేసుకోవాలని, నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణం పూర్తి కావాలని కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు పాల్గొని నిర్మాణ పురోగతిని సమీక్షించారు.
Follow Us