/rtv/media/media_files/2025/11/07/cabinet-telangana-2025-11-07-12-22-25.jpg)
తెలంగాణ మంత్రులకు బిగ్‌షాక్.. త్వరలో కేబినెట్‌లో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు కీలక మంత్రుల పదవులు ఉన్నట్లుగా సమాచారం. పనితీరు సరిగా లేని మంత్రులను అధిష్టానం తొలగించనుందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరు నివేదిక హైకమాండ్‌కు చేరిందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నివేదికపై త్వరలో అధిష్టానం రివ్యూ చేయనుందని, రివ్యూ మీటింగ్ లోపు పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదన్న హెచ్చరికలు జారీ చేసిందట. మరోవైపు కేబినెట్‌లో బెర్తు కోసం సీనియర్ల లాబీయింగ్ చేస్తున్నారట. బీసీ కోటాలో మంత్రి పదవి కోసం మధుయాష్కి, అంజన్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య ప్రయత్నాలు చేస్తున్నారట. ఎస్టీ కోటాలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్రునాయక్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సరికొత్త వ్యూహం
ఇక బీసీ వర్గాన్ని సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో త్వరలోనే మరో ఉప ముఖ్యమంత్రిని నియమించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాకుండా, రెండో ఉప ముఖ్యమంత్రిగా ఒక బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో బీసీ వర్గం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం, అలాగే రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని మరో బీసీ నేతను పీసీసీ చీఫ్ గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అందులో ప్రముఖంగా పొన్నం ప్రభాకర్ పేరు జోరుగా వినిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో మార్పులు ఖాయం అన్న టాక్ జోరుగా నడుస్తోంది. మహేశ్ గౌడ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండటం, యువ నేతగా బీసీ వర్గంలో మంచి పట్టు ఉండటం ఆయనకు అనుకూలంగా ఉంది.
బీసీలను ఆకట్టుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పడది కోర్టుల్లో పెండింగ్‌లో ఉంది. కొత్త రిజర్వేషన్ల ఆధారంగానే స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ న్యాయపరమైన చిక్కులు, కేంద్రం మోకాలు అడ్డేయడంతో వీలు కాలేదు. దీంతో ప్లా్న్ బీలో భాగంగా బీసీ నేతకు డిప్యూటీ సీఎం బాధ్యతను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో అమలు చేసిన విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొనేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇలా అన్ని జాతీయ స్థాయిలో చేసే రాజకీయాలకు తెలంగాణను ఓ మోడల్‌గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
Follow Us