తెలంగాణలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేయాలని గత కొన్నిరోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర ఉంటున్న కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించింది. ఏ క్షణమైనా కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తారనే అనుమానంతో భద్రతా విధుల నుంచి తొలగించింది. అలాగే డీజీపీ ఆఫీస్, యూఎస్ కాన్సులేట్ దగ్గర కూడా టీజీఎస్పీ కానిస్టేబుళ్లను భద్రతా విధుల నుంచి తొలగించింది.
Also Read: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ?
సమస్యల్లో ఇరుక్కోవద్దు
స్పెషల్ పార్టీ పోలీసులతో ఆయా చోట్ల భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు సెక్రటేరియట్ దగ్గర ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవద్దని, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టొద్దని చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ పేరుతో మెమో జారీ చేశారు. ఏ తప్పు చేసినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
39 మంది సస్పెండ్
ఇదిలాఉండగా.. తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని.. తెలంగాణ పోలీస్ శాఖ ఆర్టికల్ 311ను ప్రయోగించింది. దీంతో ఏకంగా 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) సిబ్బందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: భాషా సినిమాను తలపించిన ఘటన.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ?
ప్రస్తుతం తెలంగాణలో 13 బెటాలియన్లు ఉన్నాయి. వాళ్లలో అధికారులు, సిబ్బంది అంతా కలుపుకుంటే ఒక్కో బెటాలియన్‌లో వెయ్యిమంది వరకు ఉంటారు. పోలీస్ శాఖలో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షించడం, నేరాలను విచారించడం, నేరస్తులను గుర్తించడం, క్రైమ్ రేటును నిరోధించడం వంటి విధులు సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. అయితే వాళ్లకి బందోబస్తు తదితర విధుల్లో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు పనిచేస్తుంటారు. ఇక టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది మాత్రం శాంతిభద్రతల విధుల్లో ఉంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. అయితే తమను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని.. సెలవులు సరిగా ఇవ్వడం లేదని.. రెండు మూడు నెలలకొకసారి ఓ చోటు నుంచి మరో చోటుకి తరలిస్తున్నారని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు వాపోతున్నారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.