Musi: మూసీకి పూర్వ వైభవం దిశగా అడుగులు.. అక్కడ ఉండేవాళ్లకి బిగ్ షాక్

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మూసీ ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లలో నిర్మించిన ఆక్రమణలను త్వరలోనే తొలగించనున్నారు. నివాసాలు కోల్పోయేవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Musi
New Update

హైదరాబాద్‌లో మూసీ నది అంటే ఆ నగరానికే ప్రతీక లాంటిది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో మూసీ నది ప్రవహించేది. ఈ నీటిని అప్పటి ప్రజలు తాగేవారు కూడా. కానీ ఆ తర్వాత ఈ నది రూపురేఖలే మారిపోయాయి. నగరవ్యాప్తంగా మూసీనది మురికిమయం అయిపోయింది. డ్రైనేజీ నీరంతా మూసీలోనే కలిసిపోతోంది. అయితే మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. లండన్‌లో ఉన్న థేమ్స్‌ నది తరహాలో మూసీని మార్చాలనే లక్ష్యంతో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మూసీ నదిని సుందరీకరించి, నది పొడవున వాణిజ్య, వినోద కారిడర్లను ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా మార్చనున్నారు. దీనికి మొత్తం రూ.1.50 లక్షల కోట్ల వ్యయం అంచనా వేశారు. 36 నెలల్లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు మూసీ నది ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నది ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్న తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను అధికారులు త్వరలోనే తొలగించనున్నారు. అయితే ఈ తొలగింపులో నివాసాలు కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని రేవంత్ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కుటుంబాల జాబితాను కూడా కొద్ది రోజుల్లోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Also Read: రేషన్ కార్డులకు కొత్త రూల్స్.. ఆదాయం ఎంత ఉండాలో తెలుసా?

ఆయా కుటుంబాలకు ఇళ్లు అప్పగించిన తర్వాతే నిర్మాణల తొలగింపు ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకోసం హైడ్రా సహకారం సైతం తీసుకోనున్నారు. మూసీ నది ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న షెడ్లు, గోదాంల కూల్చివేతను చేపట్టనున్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాంటే ముందుగా అక్రమ నిర్మాణాలన్ని తొలగించాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకోసం గత మూడు నెలలుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(MRDCL)తో పాటు వివిధ శాఖల అధికారులతో సర్వే చేశారు. పశ్చిమాన ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి తూర్పున కొర్రెముల వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఈ సర్వేను పూర్తి చేశారు. నార్గింగ్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల వరకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో 12 వేలకు పైగా ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు.

వీటిలో హైదరాబాద్‌ జిల్లాలోని చార్మినార్‌, గోల్కొండ, హిమాయత్‌నగర్‌, బహదూర్‌పురా, నాంపల్లి, సైదాబాద్‌, ఆసిఫ్‌నగర్‌, అంబర్‌పేట, బహదూర్‌పురా మండలాల పరిధిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అంతేకాదు మూసీ నదిలోనే పలు కాలనీలు కూడా ఏర్పడ్డాయి. 30,40,60 గజాల్లోనే ఇళ్లు నిర్మించుకున్నారు. మధ్యలో 10 అడుగుల దారి సైతం లేకుండా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో గండిపేట, రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌, మేడ్చల్‌ జిల్లాలో ఉప్పల్‌ మండల పరిధిలో రామంతాపూర్, భగాయత్‌ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలో వచ్చేశాయి. అయితే ఈ ఆక్రమణలన్నీ తొలగించే బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనుంది.

Also Read:  తెలంగాణలో ఇంటర్ రద్దు.. 2025 నుంచి ‘NEP 2020’ అమలు!

ప్రస్తుతం మూసీ నది వెంట వివిధ ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీళ్లకి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సంతృప్తి పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ నది ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో కొందరు పెద్ద ఎత్తున గోదాములు, షెడ్‌లు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఇక త్వరలోనే వీటిని తొలించే ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.

#telugu-news #telangana #hyderabad #musi-river
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe