/rtv/media/media_files/2025/05/22/XHCrTLVeglRYrnUUUJS3.jpg)
Telangana Formation Day Celebrations 2025
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ వేడుకలకు కావలసిన ఏర్పాట్లపై గురువారం ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొంటాని వివరించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.
ప్రతీ శాఖ నుంచి ఓ నోడల్ అధికారి..
ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతీ శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ కు వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ మరియు సైనేజెస్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
లైవ్ టెలికాస్ట్ చేయండి..
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని దీంతో పాటు జనరేటర్ బ్యాకప్ కూడా ఏర్పాటు చేయాలని విధ్యుత్ శాఖకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ కమిషనర్ ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.డీజీపీ జితేందర్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సమాచార పౌర సంబంధాల కమిషనర్ హరీష్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
( cm revanth | telugu-news | telugu breaking news)