KCR-Kavitha: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!

కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.

New Update
KCR Kavitha

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీసుల్లో ఉన్న కవిత ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల కవిత ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవిత ఇష్యూ దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఓపికతో ఉన్న కేసీఆర్.. నిన్న హరీష్‌ రావుపైనే ఆమె వ్యాఖ్యలు చేయడంతో సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్. క్రమశిక్షణ చర్యలు చిన్నగా ఉండదని.. తీసి అవతల పడేస్తామని.. వాళ్ల కర్మకు వాళ్లు పోతారన్నారు. ఈ వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. నాడు నరేంద్ర నుంచి నేటి కవిత వరకు పార్టీకి నష్టం కలిగించే వారిని ఎవరినైనా కేసీఆర్ క్షమించడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు సొంత బిడ్డ కవిత సస్పెన్షనే ఉదాహరణ అని అంటున్నారు. 

ఇదిలా ఉంటే.. పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో కవిత నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రేపు కవిత ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రెస్ మీట్లో ఆమె తన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి సైతం ఆమె రాజీనామా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళిలోగా కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారన్న వార్తలు సైతం వస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఆమె తన ఆఫీసు పక్కన మూడంతస్తుల భవనాన్ని కిరాయికి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ పరిణామం బాధాకరమే అయినా, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. కార్యకర్తల నిర్ణయం, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి వారి కుటుంబాలలో చిచ్చుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కర్ణాటక, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చేసిందన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మాటలకు కవిత లొంగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు పల్లా. 

Advertisment
తాజా కథనాలు