/rtv/media/media_files/2026/01/04/revanth-2026-01-04-21-45-35.jpg)
గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ చేపడుతున్న ఈ విస్తరణ పనులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కీలక పిటిషన్ సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రానున్న నేపథ్యంలో, తెలంగాణ సర్కార్ న్యాయపరమైన వ్యూహాలకు పదును పెట్టింది.
ముంబైలో న్యాయ నిపుణులతో సీఎం భేటీ
ఈ కేసులో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోమవారం జరగనున్న విచారణలో తెలంగాణ తరఫున వినిపించాల్సిన వాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పనులను కోర్టు దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ చేస్తున్న ఉల్లంఘనలు, పర్యావరణపరమైన ముప్పులు, చట్టపరమైన లోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
రిట్ పిటిషన్‌లోని ప్రధానాంశాలు
పోలవరం ప్రాజెక్టును మొదట నిర్ణయించిన రూపానికి భిన్నంగా మార్చి, దానిని బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు లింక్ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ఈ క్రింది అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.
అనుమతులు లేకుండా పోలవరం నుంచి నీటిని తరలించేలా చేపడుతున్న విస్తరణ పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలివ్వాలని కోరింది.
తొలుత ఆమోదించిన డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు ఉండాలని, దానికి అదనపు మార్పులు చేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ స్పష్టం చేసింది.
కేంద్రం తీరుపై అభ్యంతరం: తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, నల్లమల సాగర్ ప్రాజెక్టు 'ప్రీ ఫిజిబులిటీ రిపోర్టులను' కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సరికాదని పేర్కొంది.
నిధుల నిలిపివేత: కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్న డీపీఆర్ (DPR) ప్రక్రియను ఆపాలని, ఈ ప్రాజెక్టులకు ఎటువంటి ఆర్థిక సాయం లేదా పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ విన్నవించింది.
కీలక విచారణకు సర్వం సిద్ధం
కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB)లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ కోరుతోంది. గోదావరి జలాల వినియోగంపై ఉన్న ఒప్పందాలను ఏపీ తుంగలో తొక్కుతోందని తెలంగాణ వాదిస్తోంది. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు లేదా ఆదేశాలు రెండు రాష్ట్రాల మధ్య జల జగడంలో అత్యంత కీలకం కానున్నాయి.
Follow Us