/rtv/media/media_files/2025/03/12/a7ODnEa6wRI3R4R5oxwN.jpg)
తెలంగాణలో నేటి నుంచి అంటే 2025 మార్చి 12వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగిస్తారు. మార్చి19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నెలాఖరు వరకు సమావేశాలు సాగే అవకాశం ఉంది. ఇందులోనే బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చించనున్నారు. అయితే ఈసారి అయిన అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్,మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఏడాది వరకు కాంగ్రెస్ సర్కార్ కు సమయం ఇవ్వాలనుకున్న కేసీఆర్.. ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మూడంచెల భద్రత ఏర్పాటు
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు దృష్ట్యా బషీర్ బాగ్, నాంపల్లి, రవీంద్రభారతి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని వారికి సూచించారు. గురుకుల స్కూళ్లు, ఉద్యోగ సమస్యలు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు.