BIG BREAKING: గువ్వల బాలరాజుకు బిగ్ షాక్ ఇచ్చిన బీఆర్ఎస్!

అచ్చంపేటలో ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్ కు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. బాలరాజు వెళ్లడంతో పార్టీకి నష్టం లేదని.. అండగా ఉంటామని భరోసానిచ్చారు.

New Update
Guvvala Balaraju (1)

ఇటీవల పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా వ్యూహాలు రచిస్తోంది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తదితర జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యకర్తలు, నేతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో 8 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వార్థంతోనే బాలరాజు పార్టీని వీడారని ఈ సందర్భంగా నేతలు ధ్వజమెత్తారు. అన్ని రకాల పదవులు, అవకాశాలను పొంది ఇప్పుడు పార్టీని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెండ్రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2009లో బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు గువ్వల. అనంతరం 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావించారు. అయితే.. అదే సమయంలో బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. అప్పటి నుంచి బాలరాజు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మారిన పరిస్థితుల నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రవీణ్ కే ఇచ్చే అవకాశం ఉందని ఆయన భావించి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో భేటీ కూడా అయినట్లు సమాచారం.

బాలరాజు వెంట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ కూడా వెళ్తారని జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ఆ నేతలు ఖండించారు. ఈ రోజు అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ కు కూడా వారు హజరయ్యారు. దీంతో వారు పార్టీని వీడుతారన్న వార్తలకు బ్రేక్ పడింది. 

త్వరలో హరీష్, కేటీఆర్ పర్యటన..

మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ సైతం అచ్చంపేటలో పర్యటించి పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బాలరాజు మాత్రం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కేడర్ అంతా తన వెంటే నడుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు