/rtv/media/media_files/2025/12/23/elections-2025-12-23-11-28-51.jpg)
Telangana Agricultural Cooperative Society : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) ఎన్నికైన పాలకవర్గాలను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సహకార సంఘాల పాలకవర్గాలను నామినేటెడ్ పాలక మండళ్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాబోయే సంక్రాంతి లోపు పాలకవర్గాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి పీఏసీఎస్‌కు 13 మందితో పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు డైరెక్టర్ పోస్టులు ఇవ్వనున్నారు. ఈ పాలకవర్గాల నుంచే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్యలు (డీసీఎంఎస్), మార్క్‌ఫెడ్, టెస్కాబ్ వంటి సంస్థలకు ప్రతినిధులు ఎంపిక అవవుతారు.అయితే, సొసైటీల్లో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే పాలకవర్గాల్లో అవకాశం కల్పిస్తారు. ఎన్నికల ఖర్చులు, గొడవల నివారణే లక్ష్యంగా పీఏసీఎస్, డీసీసీబీలను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల ఎన్నికలు రాజకీయంగా, ఆర్థికంగా భారీ ప్రభావం చూపడం పరిపాటి. డైరెక్టర్ పదవుల నుంచి చైర్మన్ వరకూ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడం, డబ్బు ఖర్చు, రాజకీయ జోక్యం, ఫిరాయింపులు, గ్రామాల్లో విభేదాలు వంటి పరిణామాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు బదులుగా నామినేషన్ విధానంలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
మార్కెట్ కమిటీల తరహాలోనే
ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలు పూర్తిగా నామినేషన్ విధానంలోనే ఏర్పాటు అవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సిఫారసుల ఆధారంగా జాబితాలు తయారు చేసి, వ్యవసాయ శాఖ మంత్రి ఆమోదంతో కమిటీలు నియమితులవుతున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణలు, సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకొని నియామకాలు జరుగుతున్నాయి. ఇదే విధానాన్ని పీఏసీఎస్‌లకూ వర్తింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
అధికార పార్టీ కార్యకర్తలకే అవకాశాలు..!
కాగా నామినేషన్ విధానం అమలులోకి వస్తే, సహకార సంఘాల్లోని అన్ని కీలక పదవులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే దక్కుతాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 207 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 183 కమిటీలకు పాలకవర్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఉన్న వారంతా అధికార పార్టీ కార్యకర్తలే. దీంతో దాదాపు మూడు వేల మందికి పైగా అధికార పార్టీ కార్యకర్తలకు పదవులు లభించాయి. ఇదే తరహాలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, మార్క్‌ఫెడ్, టెస్కాబ్‌లకు కూడా నామినేటెడ్ పాలకవర్గాలు ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మందికి పైగా కార్యకర్తలకు అవకాశాలు దక్కుతాయని, తద్వారా కార్యకర్తల్లో నిరాశను దూరం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సంక్రాంతిలోపే పూర్తి
కాగా పాలకమండళ్లను వీలైనంత త్వరగా పీఏసీఎస్‌లకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పీఏసీఎస్‌లకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పాలక మండళ్లు ఏర్పాటు చేసే అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Follow Us