అగ్ర నేతలతో 5 పబ్లిక్ మీటింగ్స్.. సింగరేణిపై ఫైట్.. పుర పోరుకు TBJP మాస్టర్ ప్లాన్ ఇదే!

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు.

New Update
BJP chef

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ ఐదు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రపోజల్స్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ప్రచారానికి జాతీయ అగ్రనేతలు రానున్నారని, మహబూబ్ నగర్‌లో జేపీ నడ్డా.. సూర్యాపేట, నల్గొండ, ఖమ్మంలలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలంతా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చి ఈ సభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

సింగరేణి టెండర్లలో భారీ కుంభకోణం

నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. "గతంలో బీఆర్ఎస్ తమ వారికి ఈ బ్లాక్‌ను కట్టబెట్టాలని చూసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది" అని విమర్శించారు. ప్రభుత్వంలోని అగ్రనేతల మధ్య వాటాల విషయంలో వచ్చిన విభేదాల వల్లే టెండర్ల అవకతవకలు బయటపడ్డాయని, అందుకే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై 2014 నుండి జరిగిన అన్ని అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

40 శాతం కమిషన్ సర్కార్

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పనిలో 40 శాతం కమిషన్ నడుస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. బీఆర్ఎస్‌లో ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే, కాంగ్రెస్‌లో నాయకులు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కవితకు వాటా తక్కువ వచ్చినందుకే గతంలో లొల్లి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి ఉందని అన్నారు.

దావోస్ పర్యటనలపై శ్వేతపత్రం డిమాండ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఆయన తప్పుబట్టారు. "పెట్టుబడుల ఒప్పందాల కోసం 7 వేల కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చుని కూడా చేసుకోవచ్చు" అని అన్నారు. గత ఏడాది దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు ఏమయ్యాయని, ఆ కంపెనీల లొకేషన్లు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. పర్యటనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, గత పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు