GADDAR JAYANTHI : గద్దర్ విషయంలో ఇప్పటికీ అది మిస్టరీగానే .. ఇంతకీ వాళ్లు ఎవరు?

1997 ఏప్రిల్‌ 6న గుర్తుతెలియని వ్యక్తులు గద్దర్ నివాసంపై దాడి చేసి, ఆయనపై కాల్పులు జరిపారు.  దాడి చేసిన వ్యక్తులెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దాడి సమయంలో గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ఓ లేఖను  విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పురోగతి లభించలేదు.  

New Update
gaddar jayanthi

gaddar jayanthi Photograph: (gaddar jayanthi)

గద్దర్ అంటే మూడక్షరాల పేరు మాత్రమే కాదు.. భూమి, భూక్తి , విముక్తి పోరాటాలను  ముందుండి నడిపిన ధీరత్వం.... అసమానతలను రూపుమాపేందుకు తన గొంతుతో ప్రజలను చైతన్యవంతం చేసిన  జంగ్ సైరన్.... తాడిత పీడిత ప్రజల కోసం అలుపెరుగని ప్రజా యుద్ధ నౌక గద్దర్.  మనకు చాలామంది కవులు, గాయకులు ఉన్నారు. కానీ గద్దర్ వేరు. గద్దర్ కన్నా బాగా పాడేవారు ఉన్నారు కానీ గద్దర్ వేరు. నేడు గద్దర్ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్.  ఆయన విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో జరిగింది.  హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను చదవారు గద్దర్.  

1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొనేవారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు.1971లో దర్శకులు బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. దీంతో ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్షను రాసారు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరారు, తర్వాత ఆయన విమలను వివాహం చేసుకోగా. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు),  ఆయనకు వెన్నెల అనే కూతురు ఉంది. 

 1984 లో ఆయన క్లార్కు ఉద్యోగానికి రాజీనామా చేసిన గద్దర్..  1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జననాట్యమండలిలో చేరిన గద్దర్...  ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగించాయి.  ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. 

తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించారు.  గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు. 

మాభూమి సినిమాలోని 'బండెనక బండి కట్టి' అనే పాటను పాడడంతోపాటు ఆ పాటలో నటించారు గద్దర్.. ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమా" అనే పాట బాగా ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు.

మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించారు గద్దర్. 'పొడుస్తున్న పొద్దూ' మీద పాట ఆయనే రాసి పాడి,అందులో నటించారు.  ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్‌ ఎంపిక చేసింది. 2016లో దండకారణ్యం మువీ, 2022లో విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్ నటించిన చివరి సినిమా.

గుండెపోటు కారణంగా 2023 జూలై 20నఅమీర్ పేట్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్సపొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు.  గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో అధికార లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరిగాయి. జనవరి 31న గద్దర్‌ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

1997 ఏప్రిల్‌ 6న గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని గద్దర్ నివాసంపై దాడి చేసి, ఆయనపై కాల్పులు జరిపారు.  గద్దర్‌పై దాడి చేసిన వ్యక్తులెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దాడి సమయంలో గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ఓ లేఖను  విడుదల చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ ఎలాంటి పురోగతి లభించలేదు.  

Also Read :  పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

#telugu-news #telangana #gaddar-jayanthi #gaddar-jayanthi-celebrations
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు