/rtv/media/media_files/2025/05/21/tAmPKwp0TdxzN6rk8Kyc.jpg)
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడకుండా పోయి, సొంతపార్టీకి గొడ్డలి పెట్టుగా మారిన నేతలపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన పలువురు నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ప్రకటించారు.
తమ్మిశెట్టి రాము, రాయల వెంకటేశ్వర్లు, అమరవరపు ప్రవీణ్, రణబోతు రామిరెడ్డి, దగ్గుపాటి రామిరెడ్డి, షేక్ సైదా మేస్త్రీ, చింతకాయలు రాము, వల్లపుదాసు కృష్ణ ఆరుగురు వార్డు నెంబర్లను స్పపెండ్ చేశారు. జగిత్యాలలో కూడా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అతని అణుచరులతో కాంగ్రెస్ పెద్దలు చెప్పినా వినకుండా మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తున్నారని టాక్. దీంతో ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి పోయింది. జీవన్ రెడ్డిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? లేదా అనేది వేచి చూడాలి. గత కొన్ని నెలల నుంచి బహిరంగానే ఆయన సొంతపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్లో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి జాబితాను పరిశీలించిన జిల్లా నాయకత్వం, ఈ మేరకు వేటు వేసింది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా, ప్రత్యర్థులతో చేతులు కలిపినట్లు లేదా స్వతంత్రంగా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నర్సయ్య తెలిపారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు, కార్యకర్తలను తక్షణమే అమల్లోకి వచ్చేలా పార్టీ నుండి బహిష్కరించారు. "పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు. క్రమశిక్షణ తప్పి పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు" అని ఈ సందర్భంగా గుడిపాటి నర్సయ్య స్పష్టం చేశారు.
జిల్లా అధ్యక్షుడి ఈ నిర్ణయం స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఎన్నికల ఫలితాలపై ఈ అంతర్గత విభేదాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న చర్చ నడుస్తోంది. అయితే, పార్టీలో నిబద్ధత ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని, వెన్నుపోటు రాజకీయాలకు తావులేదని జిల్లా కమిటీ సంకేతాలు ఇచ్చింది. మున్ముందు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇలాంటి కఠిన చర్యలే ఉంటాయని హెచ్చరించారు.
Follow Us