/rtv/media/media_files/2025/10/22/jubileehills-by-elections-2025-10-22-15-12-20.jpg)
Jubileehills By Elections
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించినట్లు తెలిపారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడం గమనార్హం. చివరిరోజైన మంగళవారం నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. కానీ చివరిరోజు ఏకంగా117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి అయ్యే సమయానికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆదివారం, మరునాడు దీపావళి పండుగ కావడంతో రెండు రోజులు సెలవు దినాలు వచ్చాయి. దీంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటెత్తారు. వివిధ అంశాల విషయంలో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నిరసన కారులు వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశముండటం, అభ్యర్థులు మాత్రం పెద్దసంఖ్యలో రావడంతో అధికారులు నామినేషన్ వేయడానికి టోకెన్ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేవారికి ముందు టోకెన్ ఇచ్చి.. అనంతరం నామపత్రాలు స్వీకరించారు. అలా చివరిరోజు188 మందికి టోకెన్లు ఇచ్చారు. దీంతో బుధవారం తెల్లవార జాము వరకు నామినేషన్లు స్వకరించారు. రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలు కాగా, ఆ తరువాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 321కి చేరుకున్నాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా..
కాగా ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత అని తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్), ఫార్మాసిటీ భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు ఉన్నారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేంగా11 మంది రైతులు నామినేషన్‌లు వేశారు. ఇక ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకుమ్మడిగా నామినేషన్లు వేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్‌లు వేసినట్లు తెలుస్తోంది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి మరో11 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు.
ఉప ఎన్నికలో ఇంత భారీగా నామినేషన్లు దాఖలు కావడం ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తోంది. ఎక్కువ మంది బరిలో నిలబడటం వల్ల వారికి కేటాయించే గుర్తుల విషయంలో ప్రధాన పార్టీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా వీరికి కేటాయించే గుర్తులు పార్టీ అభ్యర్థుల గుర్తులకు దగ్గరగా ఉంటే ఓటర్లు అయోమయానికి గురి కావలసి వస్తుంది. ఇటు ఎన్నికల సంఘానికి కూడా తలనొప్పితో కూడిన వ్యవహారంగా చెప్పుకోవచ్చు. అంత మందికి ఈవీఎం లో గుర్తులు కేటాయించడం కష్టం. దీంతో తప్పనిసరి బ్యాలెట్ పేపర్ ఉపయోగించాల్సిందే, పోటీలో ఎక్కువమంది ఉంటేఆ ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రధానపార్టీల్లో వ్యక్తమవుతోంది. నామినేషన్ల పరిశీలన బుధవారం జరగనుంది. కాగా 24 వరకు నామినేషన్ల ఉపంసహరణకు అవకాశముంది. వీరిలో ఎన్ని నామినేషన్లు చివరి వరకు ఉంటాయి. ఎంతమంది ఉపసంహరించుకుంటారు అనే విషయంలో చర్చ మొదలైంది. అభ్యర్థుల సంఖ్య 63 దాటితే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఒక కంట్రోల్ యూనిట్ 4 బ్యాలెట్ యూనిట్లను సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక్కో బ్యాలెట్ యూనిట్‌లో 16 చొప్పున 64 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. అందులో నోటా మినహాయిస్తే.. 63 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశముంది. దీంతో అంతకంటే ఎక్కువ మంది పోటిలో ఉంటే బ్యాలెట్ పోరు తప్పదని నిపుణులు అభిప్రాయపడతున్నారు. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.
Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌
Follow Us