Kavitha: కవిత కొత్త పార్టీ కష్టం.. శాసనమండలి చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా ఆమోదం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

New Update
gutta

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై శాసనమండలి చైర్మన్(Legislative Council Chairman) గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా(kavitha resignation) ఆమోదం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta-sukendar-reddy) బుధవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవితకి కొన్ని సూచనలు చేశారు. కవిత ఎమ్మెల్సీ రాజీనామా నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. కవిత రాజీనామా విషయంలో తాను తొందరపడలేదని గుత్తా స్పష్టం చేశారు. "ఎమోషనల్‌గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆమెకు సూచించాను. ఒకవేళ ఆమె వ్యక్తిగతంగా వచ్చి కలిసి ఉంటే, అప్పుడే రాజీనామా ఆమోదిద్దామనుకున్నాను. కానీ, ఆమె సభలోనే తన కారణాలు వివరించి, రాజీనామాను ఆమోదించాలని కోరడంతో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన వివరించారు. అలాగే సభలో లేని సభ్యుల పేర్లు తీసుకోకూడదనే సంప్రదాయాన్ని అందరూ పాటించాలని మండలి చైర్మన్ హితవు పలికారు.

రాజకీయ భాష - సంస్కారం

రాజకీయ నాయకుల భాషపై గుత్తా అసహనం వ్యక్తం చేశారు. నాయకులు తమ వాగ్ధాటిని అదుపులో ఉంచుకోవాలని, భాష బాగుంటేనే ప్రజల్లో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న 'బడివే' వంటి మాటలు తాను వినలేదని, అయితే ఎవరైనా సరే సంయమనంతో మాట్లాడాలని సూచించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇచ్చే గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. SLBC టన్నెల్ వ్యవహారంపై స్పందిస్తూ, అది ఒక ప్రమాదమని, దానిపై చదువుకున్న వారు రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు తన దృష్టికి రాలేదని, గతంలోని HCU భూముల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలకు అవకాశం లేదని గుత్తా అభిప్రాయపడ్డారు. "ఇప్పుడున్న పార్టీలే చాలు. పార్టీ పెట్టి నడపడం అంత సులభం కాదు" అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మహిళలపై వివక్ష ఉందన్న కవిత వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఇందిరా గాంధీ, జయలలిత, మమతా బెనర్జీ వంటి వారు గొప్ప నాయకులుగా ఎదిగారని, 33 శాతం రిజర్వేషన్లు వస్తే మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం డబ్బులు పంచే సంస్కృతిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రస్తుతం ప్రజలు కేవలం అభివృద్ధిని చూసి ఓట్లు వేసే పరిస్థితిలో లేరు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి" అని పిలుపునిచ్చారు. 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్' అంశంపై చర్చ జరుగుతోందని, అయితే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. చివరగా, తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ, "నాకు ఇంకా 71 ఏళ్లే.. రాజకీయాల్లో నాలాంటి సీనియర్ల అనుభవం అవసరం" అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు