ప్రతీ మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా బయటపడుతుందో ఎవ్వరం చెప్పలేము. కానీ ఒక్కసారి ఆ టాలెంట్ బయటపడిందంటే.. వాళ్ళను ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ సోషల్ మీడియా బాగా వాడకం లోకి వచ్చాక ఎవరి టాలెంట్ ఏంటో క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. టాలెంట్ చూపించుకోవాలనుకునే వాళ్లకు సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ ఫామ్ గా మారింది.
టాలెంట్ కు అంగవైకల్యం అడ్డుకాదని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. తాజాగా ఈ లిస్ట్ లో ఓ కళ్లు లేని యువకుడు చేరిపోయాడు. అతని టాలెంట్ ఏకంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నే కదిలించింది. తాజాగా ఓ యువకుడు కళ్లు లేకపోయినా ఎంతో అద్భుతంగా పాట పాడుతూ అందరి హృదయాలను దోచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా?
ఓ చూపు లేని యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలోని 'రామ రామ రఘురామ' పాట పాడి అదరగొట్టాడు. అతడి పాటకు బస్సులోని ప్రయాణికులు ముగ్థులయ్యారు. చప్పట్లతో అతడిని ప్రశంసించారు. యువకుడి టాలెంట్ కు అంతా మెచ్చుకున్నారు. కాగా అంధ యువకుడు పాడిన ఈ పాటను ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఒక అవకాశం ఇచ్చి చూడండి..
అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అలా ఈ వీడియో ఏకంగా సజ్జనార్ వరకు చేరింది. యువకుడి పాటతో పరవశించిపోయిన ఆయన ఎక్స్ వేదికగా స్పందించాడు.' మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కోరాడు. దీన్ని చూసిన నెటిజన్లు ప్రొఫెషనల్ సింగర్ లా ఎంతో అద్భుతంగా పాడాడంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు.