Medaram: మేడారంలో గద్దెల పునఃప్రారంభం..మొక్కులు చెల్లించుకున్నరేవంత్‌ కుటుంబం

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళ సమ్మక్క– సారలమ్మ మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. నిజమైన జాతర ఈ నెల 28 నుంచి జరగనుండగా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సారక్క గద్దెల పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో పైలాన్ ను  సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

New Update
FotoJet - 2026-01-19T081235.160

cm revanthreddy

Medaram:  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క– సారలమ్మ మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. నిజమైన జాతర ఈ నెల 28 నుంచి జరగనుండగా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సారక్క గద్దెల పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో  పైలాన్ ను  సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  కుటుంబ సమేతంగా వనదేవతలకు తొలి మొక్కు చెల్లించుకున్నారు .సమ్మక్క-సారలమ్మకు మనవడితో కలిసి రేవంత్‌  68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. .సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వనదేవతలకు పూజలు చేశారు.  సీఎం తొలి దర్శనం తర్వాత మొదటగా మహిళలకే  దర్శనం కల్పించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ వన దేవతలు సమ్మక్క- సారలమ్మలకు మొక్కిన మొక్కును తీర్చుకున్నానన్నారు. మేడారంలో చేసిన అభివృద్ధి తన మరణం తర్వాత కూడా గుర్తిండిపోయే ఘట్టమని భావోద్వేగంతో అన్నారు.  ‘ప్రతి మనిషి తన మరణానంతరం ఏమైనా గుర్తింపునిచ్చే పని చేశానా? అని వెనుదిరిగి చూసుకుంటే.. చాలామంది జీవితాల్లో శూన్యం కనిపిస్తుంది.. కానీ నాకు ఏ రోజైనా మరణమంటూ వస్తే పేదలకు, గిరిజనులకు, గిరిజనేతరులకు ఒక అద్భుతమైన చారిత్రక కట్టడాలను అందించాననే సంతృప్తి కలుగుతుంది’ అని తెలిపారు.

అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవమని సీఎం అన్నారు. గుడిలేని తల్లులను గుండెనిండా కొలుచుకొనే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని పేర్కొన్నారు. తమను నమ్మిన ప్రజల కోసం కాకతీయుల మీదనే కత్తిదూసిన వీర వనితలు సమ్మక్క- సారలమ్మలు అని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాకంటక పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే ‘హాత్‌ సే హాత్‌ జోడో’ యాత్రను ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపొంది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆనాడే ప్రతినబూనిట్లు చెప్పారు.
అ సందర్భంగానే మేడారాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లు పూర్తికాకముందే మేడారాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా, దక్షిణాదిలో కుంభమేళాగానిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆదివాసీలే కాకుండా గిరిజనేతరులను జాతరకు రప్పించేలా ఒక అద్భుతమైన చారిత్రక కట్టడాలను కట్టాలని సంకల్పించామన్నారు. భక్తులు నిరంతరం ఇక్కడకు వస్తూనే ఉంటారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. రామప్ప, లక్నవరం చెరువుల నుంచి పైపులైన్‌ ద్వారా జంపన్నవాగులో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సమ్మక్క, సారలమ్మల పౌరుషం స్ఫూర్తిగా పాలన సాగిస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం  ఈ జాతర కోసం రూ. 251 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ. 150 కోట్లతో జాతర నిర్వహణ, ఏర్పాట్లు, రూ.101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది. జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. కాగా టీటీడీ బోర్డు మాదిరిగా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు 2026, జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‎గా ఇర్ప సుకన్య సునీల్ నియమితులయ్యారు. బోర్డు డైరెక్టర్‎లుగా 15 మందిని నియమించారు.

ఆదివాసీ విందు

కాగా క్యాబినెట్‌ భేటీ అనంతరం మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హరిత హోటల్‌లో ఆదివాసీల పద్ధతుల్లో అధికారులు పసందైన విందును ఏర్పాటు చేశారు. తేనీటి విందుగా ఇప్ప పువ్వు టీ, కరక్కాయ చాయ్‌ని అందించారు. ఇక లంచ్‌లో బొంగు చికెన్‌, నాటుకోడి కూర, మటన్‌, గోదావరి చేప, గంగ రొయ్యలతో నాన్‌వెజ్‌ వెరైటీలను చేయించారు. అదేవిధంగా శాకాహారంలో అడవి చిక్కుడు కూర, ఉలువ చారు, చింతచిగురు వంటకాలను వడ్డించారు. వీటితోపాటు ఇప్పపువ్వు లడ్డూను అందించారు. రుచికరమైన ఆదివాసీ పద్ధతుల్లో చేసిన వంటకాలను సీఎం రేవంత్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇష్టంగా తిన్నారు.
  

Advertisment
తాజా కథనాలు