/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t072319794-2026-01-18-07-23-40.jpg)
Fees Control Act to come into effect from the next academic year?
Telangana : రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజు పేరుతో ఇబ్బడి ముబ్బడిగా తల్లిదండ్రుల ముక్కుపిండి వసూలు చేయడాన్ని నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ మేరకు నియంత్రణ చట్టం విధివిధానాలను రూపొందించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ చట్టంపై చర్చించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై ప్రైవేటు విద్యాసంస్థలు అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రతి రెండేళ్లకు ఒకసారి ట్యూషన్ ఫీజును 8 శాతం పెంచుకునేలా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంతకంటే ఎక్కువ పెంచుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం నియమించే రాష్ట్రస్థాయి కమిషన్ ఆమోదం పొందాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కాగా విద్యారంగ సమస్యలపై 2024 జులైలో శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై ఫీజులపై చర్చించింది. అనంతరం తెలంగాణ విద్యా కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. పీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన విద్యా కమిషన్.. తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025 పేరిట గతేడాది జనవరి 24న ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి... ముఖ్యాంశాలను ముఖ్యమంత్రికి సమర్పించింది. రెండేళ్లకు ఒకసారి 8 శాతం ఫీజు పెంపునకు అనుమతించాలనేది ఇందులో ప్రధాన అంశంగా ఉంది.
యజమాన్యాల అభ్యంతరం...
కాగా, గతంలోనూ పీజుల పెంపు విషయంలో వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని 2017లో నాటి ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. కాగా ప్రతి ఏడాది 10 శాతం పీజూలు పెంచుకోవచ్చని ఈ కమిటీ సూచించింది.కానీ, తెలంగాణ విద్యా కమిషన్ మాత్రం ఏటా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారంగా ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం రెండేళ్లకు ఒకసారి 8 శాతం పెంచుకునేలా విధి విధానాలు రూపొందించారు. కమిషన్ ఆమోదం తీసుకుంటే అంతకంటే ఎక్కువ పెంచుకునే వెసలుబాటు కల్పించారు.
అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం ఫీజుల పెంపునకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆధ్వర్యంలో పలువురు పాఠశాలల యజమానులు మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ శ్రీధర్‌బాబుతో ఇటీవల సమావేశం కావాల్సి ఉండగా...యజమాన్యాల మధ్య చర్చలు నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. అనేక రాష్ట్రాల్లో ఏడాదికోమారు పీజు పెంపు విధానమే ఉందని కొందరు యజమాన్యాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం ఏటా 5-6 శాతం పెరుగుతుండగా... రెండేళ్లకు 8 శాతం పెంపు ఎలా సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఏటా అద్దెలు చెల్లించాలని, ఉపాధ్యాయుల వేతనాలు పెంచాల్సి ఉంటుందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.ఇంజినీరింగ్ తదితర ఉన్నత విద్య కళాశాలలు మూడేళ్లకోసారి ఫీజులు పెంచుతున్నా... అక్కడ యాజమాన్య కోటా ఉంటుందని, ఆ సీట్లను ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుకు ఇవ్వడం లేదు కదా అని పాఠశాలల యజమాన్యాలు ప్రశ్నిస్తు్న్నాయి. ఈ క్రమంలోనే మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం కావడం, చర్చలు సఫలం కాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి.
Follow Us