/rtv/media/media_files/2025/08/17/congress-disciplinary-committee-meeting-today-2025-08-17-11-53-51.jpg)
Congress.. Disciplinary committee meeting today
Rajagopal Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదే పదే ఆరోపణలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై పలుసార్లు ఆరోపణలు చేశారు. ఈక్రమంలో ఈ రోజు టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) క్రమశిక్షణ కమిటీ భేటీ జరగనుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా రాజగోపాల్‌రెడ్డి అంశం పైనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి అంశంతో పాటు ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత కలహాల గురించి కూడా కమిటీ చర్చించనుంది. మిగిలిన గొడవల విషయంలో నోటీసులు, వార్నింగ్‌లు ఇచ్చినా..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాత్రం చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో, కొండా మురళి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, కానీ మాట తప్పారని రాజగోపాల్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఆయనకు హామీ ఇచ్చిన విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వేర్వేరుగా ఉండటం కూడా నేటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ నాయకులు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని కమిటీ సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని కోమటిడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేసినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.ఆయన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు.. దీనిపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాను.. ఇవాళ జరిగే భేటీలో చర్చించిన తర్వాత అన్ని విషయాలు చెబుతాను అని వివరించారు.
మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పరిశీలించమని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి చెప్పామన్నారు. మంత్రి పదవి, ఇతర విషయాలపై ఎందుకు, ఎవరిని ఉద్దేశించి ఆ వాఖ్యలు చేశారో తెలుసుకుంటామని మల్లు రవి చెప్పారు.