Municipal elections : బీసీ రాగమెత్తిన రాజకీయ పార్టీలు..మున్సిపాల్‌ ఎన్నికల్లో వారికే పెద్ద పీట

42శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి ఆమోదం లభించకపోవడంతో ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది. మిగిలిన పార్టీలు సైతం అదే స్థాయిలో టికెట్లు ఇచ్చి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

New Update
6 BC communities set for historic name changes to reclaim dignity, identity

Municipal elections

Municipal elections : గత కొంతకాలంగా రాష్ట్రంలోరాజకీయాలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దానికి ఆమోదం లభించలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే క్రమంలో మిగిలిన పార్టీలు సైతం బీసీలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్లు కేటాయించాయి.

ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే అత్యధిక ప్రాధాన్యమివ్వడం గమనార్హం. అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీ వార్డులు,కార్పొరేషన్ డివిజన్లలో బీసీ అభ్యర్థులుకే పెద్దపీట వేశాయి. కాగా ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ 53.71 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. ఇక  ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ అధికార పార్టీకంటే కొంత ఎక్కువగా 53.79 శాతం బీసీలకు సీట్లు కేటాయించింది. బీజేపీ మాత్రం.. కాస్త తక్కువగా 49.89 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ పడి మరీ బీసీలకు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లకు మించి ఆయా పార్టీలు  సీట్లు కేటాయించడం గమనార్హం.  కొన్ని జిల్లాల్లో పార్టీలు బీసీలకు పూర్తి స్థాయిలో పెద్ద పీట వేశాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మరింత ముందుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 67.66 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. ఇక ప్రతి పక్ష బీఆర్‌ఎస్‌ 60 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. బీజేపీ మాత్రం బీఆర్‌ఎస్‌ కంటే ఒక శాతం అదనంగా (61 శాతం) సీట్లు కేటాయించింది. మరికొన్ని చోట్ల పాలకపక్షం కంటే ప్రతిపక్ష బీఆరెస్సే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మునిసిపాలిటీల్లో 294 వార్డులు ఉండగా.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 127 మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌ 121 మంది బీసీలను బరిలోకి దించింది. అలాగే బైంసా మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 46 శాతం వార్డులు బీసీలకివ్వగా, కాంగ్రెస్‌ కేవలం 26 శాతమే ఇచ్చింది. ఇక నిర్మల్‌లో బీజేపీ బీసీలకు ఏకంగా 90 శాతం సీట్లు కేటాయించగా, బీఆర్‌ఎస్‌ 71 శాతం, కాంగ్రెస్‌ 57 శాతం సీట్లు కేటాయించడం గమనార్హం.బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్‌ 19 శాతం సీట్లను, బీఆర్‌ఎస్‌ 18.66 శాతం, బీజేపీ 15.80 శాతం సీట్లు కేటాయించాయి. ఇక ఎస్టీలకు పాలక, విపక్ష పార్టీలు రెండూ సమానంగా 7.66 శాతం సీట్లు కేటాయించగా, బీజేపీ 7.05 శాతం సీట్లను ఆ వర్గానికి కేటాయించింది. 

మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఆయా సీట్లలో  పోటీ చేసే అభ్యర్థులెవరో తేలిపోయింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా.. 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో 2,582 వార్డులు, ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిపి మొత్తం 2996 ఉన్నాయి. వీటిలో మొత్తం12,993 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు